న్యూఢిల్లీ: భారీ పన్ను ఎగవేత దారుడు, మద్యం వ్యాపారి విజయ్ మాల్యా సుప్రీంకోర్టు బుధవారం ఊరట నిచ్చింది. 40 మిలియన్ డాలర్ల (సుమారు రూ 266,11 కోట్ల) డిపాజిట్ చేయాలని బ్యాంకుల కన్సార్టియం కేసులో మాల్యాకు మూడు వారాల సమయాన్ని మంజూరు చేసింది. ఎస్ బీఐ కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్ కు సమాధానం చెప్పేందుకు వీలుగా ఈ గడువును మంజూరు చేసింది. జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, నేతృత్వంలోని బెంచ్ తదుపరి విచారణను ఫిబ్రవరి 2 వరకు వాయిదా వేసింది. మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.
భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం విజ్ఞప్తి మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. రూ.9 వేల కోట్లకు పైగా రుణాలిచ్చిన బ్యాంకులు ఆ సొమ్మును రాబట్టుకునేందుకు కేసు దాఖలు చేసింది.
డియాజియో నుంచి స్వీకరించిన రూ.273.32 కోట్ల డిపాజిట్ గురించి మూడు వారాల్లోగా వివరించాలని మాల్యాను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ రూ.273.32 కోట్లను మాల్యా తన కుమారుడికి బదిలీ చేయడాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దేశంలోని వివిధ బ్యాంకులకు దాదాపు రూ 9,000 కోట్ల మేర రుణాలను ఎగవేసి విజయ్ మాల్యా ఇంగ్లాండ్ కు పారిపోయిన కేసులో బ్యాంకుల కన్సార్టియం జోక్యం కోరుతూ సుప్రీంను ఆశ్రయించింది.
కాగా దేశ విదేశాల్లోని ఆస్తుల వివరాలను వెల్లడి చేయాల్సిందిగా ఏప్రిల్ 26 న సుప్రీం మాల్యాను ఆదేశించింది. అటు మాల్యా వెల్లడించిన ఆస్తుల వివరాలు అస్పష్టంగా ఉన్నాయని బ్యాంకులు ఆరోపించాయి. అలాగే 17 బ్యాంకులకు చెల్లించాల్సిన రూ 9,000కోట్ల రుణాలను మూడు వాయిదాల్లో తిరిగి చెల్లించడానికి మూడు ప్రతిపాదనలు తిరస్కరించారన్న మాల్యా వాదనలు బ్యాంకులు తిప్పికొట్టాయి.