లాయర్ మీద గ్యాంగ్రేప్పై నివేదిక కోరిన సుప్రీం
ఒక మహిళా న్యాయవాదిపై ఆమె భర్త తరఫు బంధువులు సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని నివేదికలు, పోలీసులు తీసుకున్న చర్యలు తదితరాలతో తనకు సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఛత్తీస్గఢ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్కు సూచించింది.
గ్యాంగ్ రేప్ విషయంలో తనకు న్యాయం జరగలేదంటూ ఆమె సుప్రీంకోర్టు ప్రాంగణంలో సోమవారం నాడు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళా న్యాయవాదికి పూర్తి రక్షణ కల్పించాలని తెలిపింది. సామూహిక అత్యాచారంపై తాను ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే.