లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎతాహ్ జిల్లాలో స్కూలు బస్సు, ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 25 మంది విద్యార్థులు మరణించగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
ట్రక్కును ఢీకొన్న తర్వాత బస్సు రోడ్డు పక్కకు పల్టీలు కొట్టింది. బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. అలీగంజ్‌లోని ఓ స్కూలుకు విద‍్యార్థులను తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, అధికారులు వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేప్టటారు. గాయపడ్డ విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చిన్నారుల మృతితో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. గాయపడ్డ విద్యార్థుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఎతాహ్ జిల్లాలో స్కూళ్లకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. కానీ అలీగంజ్‌లోని పాఠశాలను తెరవడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి విచారణ చేస్తున్నారు.
ప్రధాని దిగ్భ్రాంతి: రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు మరణించడం చాలా బాధాకరమని ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
ఘోర రోడ్డు ప్రమాదం, 25మంది చిన్నారుల మృతి
Published Thu, Jan 19 2017 10:33 AM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM
Advertisement