వాషింగ్టన్: ఈ రోజు నుంచి ధూమపానం మానేయాల్సిందే అంటూ చాలా మంది ఏటా కొత్త సంవత్సరం రోజు తీర్మానించుకోవడం.. రెండు మూడురోజులు కూడా ఉండలేక మళ్లీ మొదలుపెట్టేయడం మనం చూస్తుంటాం. అయితే.. పొగాకులో ఉండే నికోటిన్ పదార్థం శరీరంలో కణస్థాయి యంత్రాంగాన్ని అణచివేస్తూ ప్రభావం చూపడం వల్లే వ్యసనాన్ని మానుకోవడం కష్టం అవుతోందని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కణాల్లో సాధారణంగా ఎసిటైల్‌కోలిన్ అనే నాడీరసాయనాన్ని గ్రహించేందుకు ఎసిటైల్‌కోలిన్ రిసెప్టార్స్(ఏసీహెచ్‌ఆర్-గ్రాహకాలు) ఉంటాయి. ఇవి నికోటిన్ రసాయనానికి కూడా స్పందిస్తాయి కాబట్టి.. వీటిని నికోటిన్ ఎసిటైల్‌కోలిన్ రిసెప్టార్స్ (ఎన్‌ఏసీహెచ్‌ఆర్‌ఎస్)గా పిలుస్తారు.
అయితే శరీరంలోకి చేరే నికోటిన్.. కణాల కణ ద్రవ్యంలో ఎన్‌ఏసీహెచ్‌ఆర్‌లు గుమిగూడేలా చేస్తుందని, దాంతోపాటు అవి కణ ఉపరితలానికి ఎక్కువగా చేరి నికోటిన్‌ను ఎక్కువగా స్వీకరించేలా కూడా చేస్తుందని ఈ మేరకు ఎలుకలపై జరిపిన పరిశోధనలో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్‌ఏసీహెచ్‌ఆర్‌లపై నికోటిన్ చూపే ఈ ప్రభావాన్ని అడ్డుకుంటే గనక.. ధూమపాన వ్యసనానికి పూర్తిగా చికిత్స చేయవచ్చని, మెదడు సంబంధితమైన పార్కిన్సన్స్ (అవయవాల వణుకు) వ్యాధి నివారణకూ వీలు కానుందని పరిశోధకులు భావిస్తున్నారు.