ఈ వేసవి చాలా హాట్
* ‘గ్లోబల్ వార్మింగ్’తో భానుడి భగభగలు.. ఫిబ్రవరి 15 నుంచే సెగలు
* ఉధృతంగా వడగాలులు..పొంచి ఉన్న తాగునీటి ఎద్దడి
* ఇప్పటికే గ్రామాల్లో ట్యాంకర్లతో సరఫరా
* కోస్తాలో నీటి కష్టాలు
* వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్:
ఈ వేసవిలో భానుడి భగభగలు తీవ్రరూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మండే ఎండలకు తోడు వడగాల్పులూ తప్పేలా లేవు. వర్షాభావం, భూతాపంతో తాగునీటి ఎద్దడి అధికం కానుంది. వర్షాభావ పరిస్థితులు.. తగ్గిపోతున్న ‘గ్రీన్ కవర్’ (పచ్చదనం).. విచ్చలవిడిగా భూగర్భ జలాలను తోడేయడం.. లాంటి కారణాలవల్ల గ్లోబల్ వార్మింగ్ తీవ్రత పెరుగుతోంది. ఫలితం గా ఈ వేసవిలో కష్టాలు తప్పవని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
ఫిబ్రవరి 15 నుంచే ఎండల తీవ్రత
‘ఈశాన్యం’ ముగిసిపోయింది. ఇక మార్చి, ఏప్రిల్‌లో అక్కడక్కడా జల్లులు మినహా చెప్పుకోతగ్గ వర్షాలు కురిసే అవకాశం లేదు. ఈ ఏడాది ఎండల తీవ్రత వచ్చేనెల 15 - 20 తేదీల నుంచే ఆరంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణవేత్తలంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో గతంకంటే ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, దీనివల్ల హాట్ సమ్మర్‌ను ఎదుర్కోక తప్పదని వారు పేర్కొంటున్నారు. వర్షాభావంతో చెరువులు, జలాశయాలు, వాగులు, నదుల్లో నీరు లేకపోవడం, కాంక్రీట్ జంగిల్స్‌లా మారుతున్న గ్రామాలు, పట్టణాలు, ‘గ్రీన్ కవర్’ తగ్గిపోవడంవల్ల భూమి అధికంగా వేడెక్కుతోంది. దీనికి పెరిగే ఉష్ణోగ్రతలు తోడుకావడంవల్ల ఎండల తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉంది. మండే వేసవిలో (ఏప్రిల్ - మే నెలల్లో) వడగాలుల తీవ్రత అధికం కానుంది. దీనివల్ల వృద్ధులు, పిల్లలు మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. వడదెబ్బ మరణాల సంఖ్య గతంకంటే పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాగునీటి సమస్య ఉధృతమయ్యే ప్రమాదం పొంచి ఉంది.
ఈసారి సీమ కొంచెం మెరుగే..
గతంలో వేసవి వచ్చిందంటే రాయలసీమ జిల్లాల్లో తాగునీటి కష్టాలు అధికంగా ఉండేవి. ఈ వేసవిలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడనుంది. గత డిసెంబరులో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండవల్ల చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురవడంతో భూగర్భ జలమట్టంపైకి వచ్చింది. అనంతపురం జిల్లాలోని సగం ప్రాంతంలో కూడా చెప్పుకోతగ్గ వర్షం కురిసింది. రాయలసీమకు సంబంధించి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వచ్చే వేసవిలో నీటి ఎద్దడి ప్రమాదం ఉంది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఇప్పటికే తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చాయి. కోస్తా ప్రాంతంలోని ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో భూగర్భ జలమట్టం అడుగంటుతోంది. వచ్చే ఏప్రిల్ తర్వాత తాగునీటి సమస్య ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. వేసవి కష్టాలు అధిగమించేందుకు ఫిబ్రవరిలో కంటింజెన్సీ ప్లాన్ రూపొందించుకుంటామని గ్రామీణ మంచినీటి సరఫరా, పురపాలక అధికారులు అంటున్నారు.
ఇప్పటికే మొదలైన కష్టాలు..
చలికాలం పూర్తికాకముందే పట్టణాలు, నగరాల్లో మంచినీటికి కటకట కట ఆరంభమైంది. గత ఏడాది నీటి కరువును దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాదైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. రాష్ట్రంలో మొత్తం 110 మున్సిపాలిటీలుండగా గత ఏడాది 60 మున్సిపాలిటీలలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. ఈ ఏడాది కనీసం 100 మున్సిపాలిటీల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంటుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 110 మున్సిపాలిటీ పరిధిలో 11వేల బోర్లు ఎండిపోయినట్టు అంచనా. కాగా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి అవసరాలకు 1437 సమ్మర్ స్టోరేజీ (ఎస్‌ఎస్) ట్యాంకులు ఉండగా.. జనవరి 15 నాటి లెక్కల ప్రకారం 86 పూర్తిగా అడుగంటాయి. మరో 495 ట్యాంకుల్లో సగానికి తక్కువ పరిమాణంలో నీరు ఉంది.
నిండు శీతాకాలమైనా ఇప్పటికే రాష్ట్రంలో 252 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారానే మంచినీరు అందిస్తున్నారు. ఇక రెండు నెలల తర్వాత వచ్చే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఈ ఏడాది నాగార్జున సాగర్ కాల్వలకు నీటి విడుదల లేని కారణంగా గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కువ గ్రామాలకు ఈ సీజనులోనే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు జిల్లాలో 74 ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 70 , ప్రకాశం జిల్లాలో 59, అనంతపురం జిల్లాలో 36 ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కొనసాగుతోంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. నగరానికి తాగునీరు అందించే ప్రధాన వనరులైన రైవాడ, సీలేరు జలాశయాల్లో నీరు ఇప్పటికే అడుగంటుతోంది. భూగర్భ జలమట్టం కూడా పడిపోయింది.
అడుగంటిన జలాశయాలు
రాష్ట్రంలో జలాశయాలు అడుగంటాయి. రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటికి ఆధారమైన శ్రీశైలం ఇప్పటికే అడుగంటింది. గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, గరిష్ట నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 832.3 అడుగల మట్టం వద్ద 51.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో డెడ్ స్టోరేజీని తీసేస్తే, 18 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోగలమని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు, గరిష్ట నీటి నిల్వ 312 టీఎంసీలు. ప్రస్తుతం సాగర్‌లో 507.3 అడుగుల మట్టం వద్ద 127 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వేసవి కాలాన్ని నెట్టుకురావడం కష్టమే.
ప్రాజెక్టు నీటి మట్టం(అడుగుల్లో) నీటి నిల్వ(టీఎంసీల్లో)
గత ఏడాది ప్రస్తుతం గత ఏడాది ప్రస్తుతం
శ్రీశైలం 844.4 832.3 69 51.8
సాగర్ 541.2 507.3 190.84 127
ఈ వేసవిలో కష్టాలే
- ‘సాక్షి’తో విశ్రాంత వాతావరణ శాస్త్రవేత్త మురళీకృష్ణ
రానున్న వేసవిలో ఎండల తీవ్రతతో పాటు తాగునీటి కష్టాలు అధికంగా ఉంటాయని విశాఖపట్నానికి చెందిన విశ్రాంత వాతావరణ శాస్త్రవేత్త మురళీకృష్ణ తెలిపారు. వచ్చేనెల 15 నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. రానున్న వేసవి పరిణామాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘కృష్ణా, గోదావరి బేసిన్లలో ఇప్పటికే తీవ్ర సాగునీటి సమస్య ఉంది. వర్షాభావంవల్ల భూగర్భ జలమట్టం పాతాళానికి వెళ్లింది. విశాఖ మహానగరంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. బీచ్‌రోడ్డు పరిసరాల్లో సముద్రనీరు భూగర్భంలోకి చొచ్చుకు వస్తోంది. దీనినే సెలెనిటీ సమస్య అంటారు. మరికొన్ని తీర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
భూగర్భ జలమట్టం కిందకు వెళ్లేకొద్దీ ఈ ప్రమాదం ఎక్కువ. ఈశాన్య రుతుపవనాలు ముగిశాయి. ఇక ఇప్పట్లో వర్షాలకు అవకాశం లేదు. జూన్‌లో నైరుతీ రుతుపవనాల ద్వారానే వర్షాలు రావాల్సి ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. వడగాల్పులూ తప్పవు. ఇష్టారాజ్యంగా భూగర్భం నుంచి నీటిని తోడేయడం వల్ల ముంబై తరహా ప్రమాదాన్ని మనమూ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి. బహుళ అంతస్తుల కల్చర్‌ను తగ్గించుకోవాలి. వర్షపు నీటిని భూమిలోకి ఇంకిపోయేలా ప్రతిఒక్కరూ తమ వంతు ప్రయత్నాలు చేయాలి. ఈ దిశగా కూడా ప్రజలకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలి.’’ అని మురళీ కృష్ణ పేర్కొన్నారు.