ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి.
ముంబై: ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. షేర్ల ధరలను ప్రభావితం చేసే కీలక సమాచారాన్ని ముందుగానే తెలుసుకొని దానికి అనుగుణంగా ట్రేడింగ్ చేసే వారిపై (ఇన్‌సైడర్స్) కఠిన చర్యలు తీసుకునే విధంగా పలు చర్యలను సూచిస్తూ 18 మంది సభ్యులతో కూడిన జస్టీస్ ఎన్‌కే సోధీ కమిటీ 75 పేజీల నివేదికను సెబీకి సమర్పించింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పరిధిలోకి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మ్యూచువల్ ఫండ్స్, ట్రస్టీలనూ చేర్చింది.
షేర్ల ధరలను ప్రభావితం చేసే సమాచారం అందుబాటులో ఉన్న ప్రభుత్వాధికారులు అందరినీ ఈ నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చారు. ఇవి అమల్లోకి వస్తే కంపెనీలో పనిచేసే ప్రతీ ఉద్యోగి, వారి సమీప బంధువులు ఈ కంపెనీ షేర్లను కొన్నా, లేక అమ్మినా ఆ వివరాలను తప్పకుండా కంపెనీకి చెప్పాల్సి ఉంటుంది. గతంలో కంపెనీలోని కీలక వ్యక్తులకు మాత్రమే ఈ నిబంధనలుండేవి. అలాగే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైనా ముందుకొచ్చి, కంపెనీ విలువను మదింపు చేస్తే ఆ విషయాన్ని వాటాదారులకు బహిరంగంగా కనీసం 2 రోజుల ముందే తెలియచేయాల్సి ఉంటుంది. ఈ కమిటీ సిఫార్సులపై డిసెంబర్ 31 వరకు సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత తుది మార్గదర్శకాలను విడుదల చేస్తారు.