బీబీఎం, వాట్స్‌యాప్‌లపై సెబీ కన్ను
న్యూఢిల్లీ: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు చెక్ పెట్టే బాటలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ... ఫండ్ మేనేజర్లు, ట్రేడర్లు, బ్రోకర్లు వినియోగించే బ్లాక్‌బెర్రీ ఫోన్ల మెసెంజర్(బీబీఎం) సర్వీసులు, వాట్స్‌యాప్‌లపై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా వెబ్ ఆధారిత సోషల్ నెట్‌వర్కింగ్ యాప్స్, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకోవడం ద్వారా క్లయింట్ల తరఫున వీళ్లు చేపట్టే ట్రేడింగ్(ఆర్డర్లు)ను పరిశీలించనుంది. ఈ వివరాలను సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే క్లయింట్ల తరఫున ఆర్డర్లను చేపట్టేందుకు బ్రోకర్లు, ఫండ్ మేనేజర్లకు సంబంధించి వ్యక్తిగత మొబైళ్ల వినియోగాన్ని సెబీ నిషేధించిన సంగతి తెలిసిందే. ఒక జట్టుగా ఏర్పడి(కార్టెల్) క్లయింట్ల లావాదేవీలు తదితర కీలక సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా షేర్ల ధరల రిగ్గింగ్‌కు పాల్పడటం వంటి అక్రమాలను అడ్డుకోవాలని సెబీ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా క్లయింట్ల లావాదేవీల వివరాలను భద్రపరచాల్సిందిగా బ్రోకింగ్ సంస్థలు, ఫండ్ హౌస్‌లను ఆదేశించినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో అవసరమైతే పరిశీలించేందుకు వీలుగా క్లయింట్ల రికార్డులను భద్రపరచి ఉంచమని సెబీ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సోషల్ నెట్‌వర్కింగ్, వెబ్ ఆధారిత మెసేజింగ్ సర్వీసులు పెరిగిన నేపథ్యంలో డీలింగ్ రూమ్ కార్యకలాపాలకు సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు వెల్లడించాయి. ప్రధానంగా షేర్లు, డెరివేటివ్స్, కరెన్సీ ఫ్యూచర్స్ వంటివి నిర్వహించే వ్యక్తులు సంస్థలపై నిఘా పెరగనున్నట్లు తెలిపాయి. స్టాక్ మార్కెట్ కార్యకలాపాలపై నిఘాలో భాగంగా సెబీ ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లపై దృష్టిపెట్టింది. వీటి ద్వారా జరుగుతున్న విశ్లేషణలను పరిశీలించేందుకు సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను ఏర్పాటు చేసుకుంది కూడా. క్యాపిటల్ మార్కెట్ కేసుల్లో టెలికం కంపెనీల నుంచి కాల్ డేటా రికార్డులు, తదితర సమాచారాన్ని పొందే అధికారాలను సెబీ ఇప్పటికే పొందిన విషయం విదితమే. ఈ బాటలోనే బీబీఎం, వాట్స్‌యాప్ వంటి సర్వీసులపై సైతం కన్నేసింది.