మాస్కో: రష్యాలో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆదివారం నాటి ఆత్మాహుతి దాడి నుంచి తేరుకోకముందే.. అదే వోల్గోగ్రాడ్ నగరంలో సోమవారం బస్సులో ఓ ఆగంతకుడు తనను తాను పేల్చేసుకున్నాడు. తాజా దాడిలో 14 మంది మృత్యువాత పడగా.. మరో 28 మంది గాయపడ్డారు. ఉదయం పూట కావడంతో ట్రాలీ బస్సు కిక్కిరిసిపోయి ఉన్న సమయంలో ఈ పేలుడు జరిగింది. దీంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. బస్సు ముందుభాగం, రూఫ్ మాత్రమే మిగిలాయంటే పేలుడు తీవ్రంత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి మృతదేహాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
డీఎన్‌ఏ నమునాల ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి వ్లాదిమిర్ మార్కిన్ తెలిపారు. పేలుడు కోసం నాలుగు కేజీల టీఎన్‌టీని ఉపయోగించారని చెప్పారు. ఆదివారం నాటి బాంబు దాడిలో వినియోగించిన పేలుడు పదార్థాల వంటివే తాజా పేలుడులో కూడా ఉపయోగించినట్టు గుర్తించామన్నారు. ఆదివారం వోల్గోగ్రాడ్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 17 మంది మృతి చెందడం తెలిసిందే.