'లెటర్ బాంబు' పేల్చిన బీజేపీ సీనియర్ నేత
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న బీజేపీ.. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల దాడిని ఎదుర్కొనేందుకు మల్లగుల్లాలు పడుతుండగా.. ఊహించని విధంగా సొంత పార్టీ ఎంపీనే ఈ విషయంపై లెటర్ బాంబు పేల్చారు. బీజేపీ నేతలపై అవినీతి ఆరోపణలు రావడం పార్టీ ప్రతిష్టను మసకబార్చేలా ఉందని, అవినీతి నిర్మూలించేందుకు లోక్పాల్ మాదిరిగా ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మాజీ మంత్రి శాంతకుమార్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశారు. ఈ లేఖ 10 రోజుల కిందటే పంపినా పార్లమెంట్ సమావేశాల ముందురోజు ఫేస్బుక్లో పెట్టారు.
మధ్యప్రదేశ్లో వ్యాపం స్కాం సిగ్గుతో తలదించుకునేలా చేసిందని శాంతకుమార్ ఘాటుగా విమర్శించారు. రాజస్థాన్, మహారాష్ట్రలో అవినీతి భాగోతాన్ని ప్రస్తావిస్తూ నేతల అవినీతిని అరికట్టేందుకు లోక్పాల్ బిల్లు అవసరముందని లేఖలో పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే పేర్లు ప్రస్తావించకుండానే విమర్శలు ఎక్కుపెట్టారు. లేఖలో రాసిన ప్రతి పదానికి తాను కట్టబడిఉన్నానని చెప్పారు. వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన శాంతకుమార్ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ గీతను దాటికి శాంతకుమార్ బహిరంగంగా విమర్శలు సంధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.