2013 ముగింపు సానుకూలం
పాజిటివ్ ముగింపుతో 2013 సంవత్సరానికి స్టాక్ మార్కెట్ వీడ్కోలు పలికింది. మంగళవారం మందకొడిగా జరిగిన ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 27 పాయింట్ల స్వల్పలాభంతో 21,170 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 6,304 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్ల మద్దతుతో ఈ ఏడాదిలో సెన్సెక్స్ 9 శాతం ర్యాలీ జరపగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6.5 శాతం ఎగిసింది. సంస్థాగత ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలు మందగించడంతో తాజా ట్రేడింగ్ సెషన్లో హెవీవెయిట్ షేర్లు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి.
టాటా పవర్, ఐడీఎఫ్‌సీ, జేపీ అసోసియేట్స్ షేర్లు 3-4 శాతం మధ్య పెరగ్గా, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, విప్రోలు 1-2 శాతం మధ్య ఎగిసాయి. అయితే మిడ్‌క్యాప్ షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. అమెరికా టైర్ల కంపెనీ కూపర్ డీల్ నుంచి వైదొలిగిన ఫలితంగా అపోలో టైర్స్ భారీ ట్రేడింగ్ పరిమాణంతో 6 శాతం ర్యాలీ జరిపింది. నగదు విభాగంలో ట్రేడయ్యే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో యూబీ హోల్డింగ్స్, టీసీఐ, మీర్జా ఇంటర్నేషనల్, తాజ్ జీవీకే, డెన్ నెట్‌వర్క్స్, రిలాక్సో ఫుట్‌వేర్ షేర్లు 10-20 శాతం మధ్య పెరిగాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 309 కోట్ల నికరపెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 280 కోట్ల నికర అమ్మకాలు జరిపాయి.
ఐటీ ఇండెక్స్ టాప్ : 2013లో ప్రధాన సూచీలను అధిగమించి బీఎస్‌ఈ ఐటీ సూచి భారీగా 59 శాతం పెరిగింది. ఫార్మా ఇండెక్స్ 22 శాతం పెరుగుదలతో ద్వితీయస్థానాన్ని ఆక్రమించగా, ఆటో, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌లు 7-11 శాతం మేర పెరిగాయి. బీఎస్‌ఈ రియల్టీ సూచీ 32 శాతం పతనమయ్యింది. బ్యాంకింగ్, మెటల్ ఇండెక్స్‌లు 9 శాతం చొప్పున క్షీణించాయి. బ్లూచిప్ షేర్లతో కూడిన ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు పెరిగినా, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు మాత్రం ఈ ఏడాది విలవిలలాడాయి.
జపాన్ నికాయ్ రికార్డు : అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి విడుదల చేసిన భారీ నిధుల ఫలితాన్ని అన్ని దేశాల సూచీలు అందిపుచ్చుకున్నా, జపాన్ నికాయ్ ఇండెక్స్ అన్నింటికంటే ఎక్కువగా 57 శాతం ర్యాలీ జరిపింది. 2013లో అమెరికా డోజోన్స్, ఎస్ అండ్ పీ, నాస్‌డాక్‌లు మూడూ 25 శాతంపైగా పెరిగాయి. 1996వ సంవత్సరం తర్వాత డో, ఎస్ అండ్ పీలు ఒకే ఏడాది ఇంత భారీగా పెరగడం ఇదే ప్రధమం. ప్రధాన యూరప్ దేశాల ఇండెక్స్‌లు 12-35 శాతం మధ్య పెరిగాయి. వర్థమాన దేశాల సూచీల్లో అత్యధికంగా అర్జింటీనా సూచీ 89 శాతం ర్యాలీ చేసింది.
నిఫ్టీలో లాంగ్ బిల్డప్ : కొద్ది రోజుల నుంచి చిన్న శ్రేణికి పరిమితమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కొత్త సంవత్సరం తొలిరోజుల్లో ర్యాలీ జరపవచ్చన్న అంచనాలతో మంగళవారం నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో లాంగ్ బిల్డప్ జరిగింది. స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం క్రితంరోజుకంటే 7 పాయింట్లు పెరగడం, 6,300 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరగడం వంటివి లాంగ్ బిల్డప్‌ను సూచిస్తున్నాయి. నిఫ్టీ 6,304 వద్ద ముగియగా, ఫ్యూచర్ 51 పాయింట్ల ప్రీమియంతో 6,355 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. క్రితం రోజున ఈ ప్రీమియం 44 పాయింట్లే. ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 4.94 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 1.97 కోట్ల షేర్లకు పెరిగింది. 6,300 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరగడంతో ఈ పుట్ ఆప్షన్ ఓఐలో 3.59 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇదే స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 19 వేల షేర్లు కట్ అయ్యాయి. 6,300 స్థాయిపైన స్థిరపడితే నిఫ్టీ క్రమేపీ ర్యాలీ జరపవచ్చని, ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే బలహీనపడవచ్చని ఈ డేటా సూచిస్తున్నది.