ఆర్‌బీఐ పాలసీ దెబ్బ
ఎవరూ ఊహించని విధంగా రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ రాజన్ ద్రవ్యోల్బణ ంపై పాత అస్త్రాన్నే ప్రయోగించారు. రెపో రేటును 0.25% పెంచడం ద్వారా వృద్ధి రేటుకంటే ద్రవ్యోల్బణ అదుపే ఆర్‌బీఐకు ప్రధానమని చాటిచెప్పారు. దీంతో రెపో రేటులో కోత లేదా యథాతథ స్థితిని ఊహిస్తూ వచ్చిన మార్కెట్లు ఒక్కసారిగా కంగుతిన్నాయి.
ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం వెలువడ్డ వెంటనే ఇండెక్స్‌లు ఉన్నట్టుండి కుప్పకూలాయి. సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల వరకూ దిగజారి 20,051కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ కూడా 180 పాయింట్ల వరకూ పతనమై కనిష్టంగా 5,933ను తాకింది. అయితే ఆకర్షణీయ ధరలకు పతనమైన బ్లూచిప్స్‌లో కొనుగోళ్లు పుంజుకోవడంతో చివర్లో కొంతమేర కోలుకున్నాయి. వెరసి సెన్సెక్స్ 383 పాయింట్లు కోల్పోయి 20,264 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 103 పాయింట్ల నష్టాన్ని మిగుల్చుకుని 6,012 వద్ద స్థిరపడింది. రెపో పెంపుతో ప్రధానంగా వడ్డీ ప్రభావిత రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ యథాతథ పాలసీ ప్రకటనతో గురువారం సెన్సెక్స్ 684 పాయింట్లు పుంజుకోవడం ద్వారా దాదాపు మూడేళ్ల గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే.
వడ్డీ పెంపు భయాలు
వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలతో రియల్టీ రంగం 6.5% పడిపోగా, బ్యాంకింగ్ 4.2% పతనమైంది. రియల్టీ షేర్లలో డీఎల్‌ఎఫ్ దాదాపు 12% దిగ జారగా, హెచ్‌డీఐఎల్, అనంత్‌రాజ్, ఇండియాబుల్స్, యూనిటెక్, డీబీ, ఒబెరాయ్ 8-4% మధ్య తిరోగమించాయి. ఇక బ్యాంకింగ్ దిగ్గజాలలో పీఎన్‌బీ, యూనియన్, యస్ బ్యాంక్ 8% స్థాయిలో పతనంకాగా, ఇండస్‌ఇండ్, బీవోబీ, ఐసీఐసీఐ, కెనరా, బీవోఐ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఎస్‌బీఐ, యాక్సిస్ 6-3% మధ్య నష్టపోయాయి. ఈ బాటలో మిగిలిన దిగ్గజాలు ఎల్‌అండ్‌టీ, సెసా గోవా, హెచ్‌యూఎల్, హిందాల్కో, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, హీరో మోటో, భారతీ, బజాజ్ ఆటో 5-3% మధ్య క్షీణించాయి. కాగా, గురువారం రూ. 3,544 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు జోరు కొనసాగిస్తూ శుక్రవారం మరో రూ. 946 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 790 కోట్ల విలువైన అమ్మకాలను చేపట్టాయి.
చిన్న షేర్లదీ అదే బాట
బీఎస్‌ఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1% స్థాయిలో నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,432 నష్టపోగా, 897 మాత్రమే లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ నుంచి తొలగిస్తున్న దేనా బ్యాంక్ 8%, విజయా బ్యాంక్ 5% చొప్పున పతనమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో రూ. 18,303 కోట్లు, బీఎస్‌ఈలో రూ. 2,551 కోట్లు చొప్పున టర్నోవర్ జరిగింది.