ద్రవ్యోల్బణం ఎఫెక్ట్.. మరో 257 పాయింట్ల ర్యాలీ
టోకు ద్రవ్యోల్బణం వృద్ధి రేటు ఐదు నెలల కనిష్టస్థాయికి దిగిరావడంతో మార్కెట్లో మరో భారీ ర్యాలీ జరిగింది. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్ల సహకారంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 257 పాయింట్లు ఎగిసి ఐదు వారాల గరిష్టస్థాయి 21,289 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 79 పాయింట్లు ర్యాలీ జరిపిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 6,300 స్థాయిపైన 6,320 పాయింట్ల వద్ద ముగిసింది. డిసెంబర్ రెండోవారం తర్వాత సూచీలు ఇంత గరిష్టస్థాయిలో క్లోజ్‌కావడం ఇదే ప్రధమం. మూడురోజుల్లో నికరంగా 530 పాయింట్లు పెరిగినట్లయ్యింది. ద్రవ్యోల్బణం రేటు అంచనాల్ని మించి తగ్గినందున, వచ్చే పరపతి విధాన సమీక్షలో రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లు పెంచదన్న విశ్వాసం ఇన్వెస్టర్లలో ఏర్పడినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ప్రపంచబ్యాంక్ తాజా అంచనాల్ని వెలువరించడం కూడా సెంటిమెంట్‌ను బలపడిందని ఆ వర్గాలు వివరించాయి. ఫైనాన్షియల్ షేర్లు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీలు 2-4 శాతం మధ్య ఎగిసాయి. క్యాపిటల్ గూడ్స్ షేర్లు లార్సన్ అండ్ టూబ్రో, బీహెచ్‌ఈఎల్‌లు, మెటల్ షేర్లు సేసా స్టెరిలైట్, ఎన్‌ఎండీసీలు 2-3 శాతం మధ్య పెరిగాయి. ఉత్పాదక ప్లాంట్లపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ర్యాన్‌బాక్సీ 2 శాతంపైగా క్షీణించింది.
నిఫ్టీ ఆప్షన్లలో పుట్ బిల్డప్....
రెండు వారాల తర్వాత నిఫ్టీ తిరిగి 6,300 స్థాయిని అధిగమించడంతో 6,200, 6,300 స్ట్రయిక్స్ వద్ద భారీ పుట్ బిల్డప్ జరిగింది. 6,200 పుట్ ఆప్షన్లో తాజాగా 8.59 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 71.23 లక్షల షేర్లకు పెరిగింది. 6,300 పుట్ ఆప్షన్లో 10.57 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 41.36 షేర్లకు చేరింది. అలాగే ఈ రెండు స్ట్రయిక్స్ వద్ద కాల్ కవరింగ్ జరగడంతో 6,200 కాల్ ఆప్షన్ నుంచి 5.86 లక్షల షేర్లు, 6,300 కాల్ ఆప్షన్ నుంచి 3.88 లక్షల షేర్లు కట్ అయ్యాయి. 6,400 కాల్ ఆప్షన్లో కూడా స్వల్పంగా 69 వేల షేర్లు కట్ అయ్యాయి. ఈ స్ట్రయిక్ వద్ద మొత్తం ఓఐ ఓ మోస్తరుగా 48 లక్షల షేర్ల వరకూ వుంది. ఇక నిఫ్టీ ఫ్యూచర్లో 4.60 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 1.82 కోట్ల షేర్లకు పెరిగింది. స్పాట్‌తో పోలిస్తే ఫ్యూచర్ నిఫ్టీ ప్రీమియం 10 పాయింట్ల మేర వుంది. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 6,300పైన స్థిరపడగలిగితే 6,400 స్థాయిని అధిగమించవచ్చని, ఏదైనా ప్రతికూల వార్త వెలువడితే 6,200 స్థాయి వద్ద గట్టి మద్దతు లభించవచ్చని ఈ ఆప్షన్ డేటా సూచిస్తున్నది.