పేలవ ప్రదర్శనలో మార్కెట్లు
ముంబై : బుధవారం భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నేటి ట్రేడింగ్లో కూడా పేలవమైన ప్రదర్శననే కనబరుస్తున్నాయి. నెగిటివ్ వాతావరణంలో సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఐటీ స్టాక్స్ కొనుగోలుతో సెన్సెక్స్ 17.08 పాయింట్ల స్వల్ప లాభంలో 27,791 వద్ద, నిఫ్టీ 8,569 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. హెల్త్ కేర్ స్టాక్స్ 1 శాతం డౌన్ అయ్యాయి. సన్ ఫార్మా 4 శాతం పతనమైంది. తన సబ్సిడరీ టారో ఫార్మా బలహీనమైన తొలి త్రైమాసిక ఫలితాలతో సన్ ఫార్మా నష్టాలను గడిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కోలు సైతం 2-3 శాతం తక్కువకు ట్రేడ్ అవుతున్నాయి.
దిలీప్ బిల్డ్కాన్ షేర్ మాత్రం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తూ 14 శాతం ఎగిసి మార్కెట్లో స్ట్రాంగ్ లిస్టింగ్గా నిలుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) 2 శాతం మేర ఎగిసింది. సిమెంట్ తయారీదారి ఏసీసీ, సిగరేట్ మేకర్ ఐటీసీ, ఐడియా సెల్యులార్, హీరో మోటార్ కార్పొ, ఆల్ట్రాటెక్ సిమెంట్, లుపిన్లు 1శాతం లాభాల్లో నడుస్తున్నాయి. బ్యాంకు ఆఫ్ బరోడా దాదాపు ప్రకటించిన నిరాశజనకమైన తొలి త్రైమాసిక ఫలితాలతో స్టాక్ 7.5 శాతం మేర పతనమైంది. అధిక ప్రొవిజన్స్, తక్కువ నికర వడ్డీ ఆదాయాలతో జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఈ బ్యాంకు తన నికర లాభాలు 59.74 శాతం పడిపోయినట్టు ప్రకటించింది. దీంతో ఈ బ్యాంకు షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి.
అటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.17 పైసలు బలహీనపడి 66.89గా నమోదవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 76 రూపాయల నష్టంతో రూ.31,317గా ఉంది.