నష్టాలు కొంత రికవరీ 333 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
సిరియాపై సైనిక దాడి ఆందోళనలు ఉపశమించడంతోపాటు, దేశీయంగా రూపాయి బలపడటంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. మరోవైపు రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్‌పై పెరిగిన అంచనాలు సెంటిమెంట్‌కు ప్రోత్సాహాన్నిచ్చాయి. వెరసి సెన్సెక్స్ 333 పాయింట్లు ఎగసి 18,567 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 107 పాయింట్లు జంప్‌చేసి 5,448 వద్ద నిలిచింది. రుపీ పతనం, సిరియా ఆందోళన ల నేపథ్యంలో మంగళవారం సెన్సెక్స్ 651 పాయింట్లు పడిపోవటం తెలిసిందే.
రియల్టీ పల్టీ...
బీఎస్‌ఈలో రియల్టీ మినహా అన్ని రంగాలూ లాభపడగా... మెటల్, హెల్త్‌కేర్, ఆటో, ఐటీ, ఆయిల్, బ్యాంకింగ్ రంగాలు 2% స్థాయిలో పురోగమించాయి. అయితే గృహ రుణాలను దశలవారీగా విడుదల చేయాలంటూ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు పెట్టడంతో రియల్టీ షేర్లు శోభా, పుర్వంకారా, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ 6.5-1.5% మధ్య పతనమయ్యాయి. దీంతో రియల్టీ ఇండెక్స్ 0.5% తిరోగమించింది. కంపెనీ వ్యవస్థాపకుడు విక్రమ్ ఆకుల, ఇన్వెస్టర్ సంస్థ సీక్వోయా క్యాపిటల్ కలిపి 24 లక్షల షేర్లను విక్రయించడంతో ఎస్‌కేఎస్ మైక్రో షేరు 6% దిగజారింది.
ఒక్కటి మాత్రమే
సెన్సెక్స్ షేర్లలో ఒక్క ఐటీసీ మాత్రమే అదికూడా నామమాత్రంగా నష్టపోయింది. మిగిలిన దిగ్గజాలలో భెల్ 6% దూసుకెళ్లగా, టాటా మోటార్స్, భారతీ, ఐసీఐసీఐ, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో 4.7-2.7% మధ్య పుంజుకున్నాయి. మెటల్ షేర్లు హిందాల్కో, టాటా స్టీల్, జిందాల్ స్టీల్ 4-2.7% మధ్య పురోగమించగా, ఆయిల్ దిగ్గజాలు ఆర్‌ఐఎల్, ఓఎన్‌జీసీ 2.3% చొప్పున లాభపడ్డాయి. ఈ బాటలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ సైతం 3.2-2.4% చొప్పున పురోగమించాయి. సెంటిమెంట్‌ను పట్టిచూపుతూ ట్రేడైన షేర్లలో 1,364 లాభపడగా, 927 నష్టపోయాయి. ఎఫ్‌ఐఐలు రూ. 173 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 222 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి.