సెన్సెక్స్.. 322 మైనస్
గత నాలుగు నెలల్లో లేని విధంగా మార్కెట్ డీలాపడింది. రోజంతా అమ్మకాలదే పైచేయి కావడంతో సెన్సెక్స్ 322 పాయింట్లు పతనమైంది. వెరసి రెండు వారాల కనిష్టమైన 24,234 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 94 పాయింట్లు తగ్గి 7,236 వద్ద నిలిచింది. ఇంతక్రితం జనవరి 27న మాత్రమే ఇండెక్స్‌లు ఈ స్థాయిలో దిగజారాయి. సెన్సెక్స్ 426 పాయింట్లు, నిఫ్టీ 131 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగా ఉండటం, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో భారీ అమ్మకాలు కలగలసి మార్కెట్‌ను పడగొట్టినట్లు నిపుణులు తెలిపారు. మరోవైపు మే నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. కంపెనీ ప్రెసిడెంట్ బీజీ శ్రీనివాస్ రాజీనామాతో ఇన్ఫోసిస్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో షేరు దాదాపు 8% పతనమై రూ. 2,924 వద్ద ముగిసింది. షేరుకి తుది డివిడెండ్ రూ. 43 చెల్లింపు గడువు ముగియడం కూడా షేరుపై ప్రభావాన్ని చూపినట్లు నిపుణులు తెలిపారు.
ఐటీ, ఆయిల్ బోర్లా
బీఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోగా, ఐటీ 3.5% దిగజారింది. ఈ బాటలో ఆయిల్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ 1.5% చొప్పున నీరసించాయి. కాగా, ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజుల్లో రూ. 550 కోట్ల అమ్మకాలను చేపట్టిన ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 523 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్ మాత్రం రూ. 195 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి.
ఇవీ ఇతర విశేషాలు...
సెన్సెక్స్‌లో కేవలం ఏడు షేర్లు లాభపడగా, హిందాల్కో, ఎంఅండ్‌ఎం, డాక్టర్ రెడ్డీస్ 1.5% స్థాయిలో లాభపడ్డాయి.
మరోవైపు ఓఎన్‌జీసీ, విప్రో, భెల్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆర్‌ఐఎల్, ఐసీఐసీఐ 2.7-1.3% మధ్య డీలాపడ్డాయి.
మిడ్ క్యాప్స్‌లో బజాజ్ ఎలక్ట్రికల్స్ 14% పడిపోగా, కిర్లోస్కర్ బ్రదర్స్, వొకార్డ్, పీఐ ఇండస్ట్రీస్, ఏబీజీ షిప్‌యార్డ్, జైన్ ఇరిగేషన్, జిందాల్ స్టెయిన్‌లెస్, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్, నైవేలీ లిగ్నైట్, బాంబే బర్మా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 9-5% మధ్య పతనమయ్యాయి.
నిఫ్టీ టార్గెట్ 8,400: మెక్వారీ
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో నిఫ్టీ టార్గెట్‌ను 7,200 నుంచి 8,400కు పెంచుతున్నట్లు మెక్వారీ సెక్యూరిటీస్ పేర్కొంది. మోడీ ప్రభుత్వం పనితీరుపట్ల ఆశావహ ధృక్పథంతో అంచనాలను పెంచినట్లు మెక్వారీ నిపుణులు రాకేష్ అరోరా చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న అంచనాలున్నాయని తెలిపారు. దీంతో సిమెంట్ వంటి సైక్లికల్ రంగాలతోపాటు, అన్ని రంగాలూ పురోభివృద్ధి సాధించే అవకాశమున్నదని, వెరసి మార్కెట్‌పట్ల బుల్లిష్‌గా ఉన్నామని చెప్పారు. ప్రస్తుత సానుకూల పరిస్థితులతో నిఫ్టీ లక్ష్యాన్ని మరోసారి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు రాకేష్ పేర్కొన్నారు.