ఒడిదుడుకుల వారము
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో మార్చి నెల ఎఫ్ అండ్ వో కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను చవిచూస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకోవడానికి ప్రాధాన్యమిచ్చే అవకాశమున్నదని తెలిపారు. వచ్చే నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో వడ్డీ ప్రభావిత రంగాలలో లావాదేవీలు పుంజుకుంటాయని అంచనా వేశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నందున ట్రేడర్ల కార్యకలాపాలు ఊపందుకుంటాయని దీంతో ఇండెక్స్‌లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని అభిప్రాయపడ్డారు. వెరసి ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాల షేర్లవైపు దృష్టిసారిస్తారని పేర్కొన్నారు.
వెలుగులో చిన్న షేర్లు : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ)లో మార్చి డెరివేటివ్స్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మార్కెట్లు ఒడిదుడుకులు చవిచూస్తాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ అంచనా వేశారు. ఇందుకు లోక్‌సభ ఎన్నికలు, రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్ష వంటి అంశాలు కూడా కారణంకానున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాలు వెలుగులో నిలుస్తాయని, వీటికితోడు చిన్న షేర్లకు డిమాండ్ కనిపిస్తుందని చెప్పారు. ఇకపై క్యూ4 ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్లను నడిపిస్తాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 6,475 స్థాయి కీలకంగా నిలవనున్నదని తెలిపారు. ఈ స్థాయికి దిగువన అమ్మకాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.
ఎన్నికలపై అంచనాలు: వచ్చే నెల 7 నుంచి మే 12 మధ్య కాలంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల ద్వారా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలున్నాయని విశ్లేషకులు తెలిపారు. ఇది విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు(ఎఫ్‌ఐఐలు) ప్రోత్సాహాన్నిస్తున్నదని చెప్పారు. దీంతో గడిచిన నెల రోజుల్లో మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్, నిఫ్టీ 5%పైగా పురోగమించాయని వివరించారు.
ఫెడ్ ఎఫెక్ట్: వచ్చే ఏడాది(2015) ద్వితీయార్థంలో వడ్డీ రేట్లను పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్షలో సంకేతాలిచ్చింది. మరోవైపు నెలకు 10 బిలియన్ డాలర్ల చొప్పున సహాయక ప్యాకేజీలో కోతను పెంచుతూ వస్తోంది. దీంతో ప్రస్తుతం ప్యాకేజీ 55 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా, త్వరలో పూర్తిస్థాయిలో ప్యాకేజీని ఉపసంహరించే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామాలు విదేశీ పెట్టుబడుల రాకపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ అంటోంది.
ఎఫ్‌ఐఐల జోష్
న్యూఢిల్లీ: దేశీ స్టాక్స్‌పై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) ఆసక్తి కొనసాగుతోంది. వెరసి ఈ నెలలో ఇప్పటి వరకూ దాదాపు రూ. 9,600 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు ఎఫ్‌ఐఐలకు ప్రోత్సాహమిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సెబీ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం మార్చి నెలలో (21 వరకూ) ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 9,600 కోట్లను(156 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. ఇక ఇదే కాలంలో రుణ(డెట్) సెక్యూరిటీలలో మరింత అధికంగా రూ. 12,816 కోట్లను(200 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.