భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
Published Mon, Sep 12 2016 9:41 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
ముంబై : బలహీనమైన అంతర్జాతీయ పరిణామాలతో సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 522.91 పాయింట్లకు పైగా పతనంతో ప్రారంభమైన సెన్సెక్స్, 28,354 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ సైతం 142.55 పాయింట్ల నష్టంతో 8,724 వద్ద నమోదవుతోంది. అంతర్జాతీయ ఈక్విటీస్లో భారీ అమ్మకాల ఒత్తిడి, దేశీయ మార్కెట్లకు ఎసరు పెట్టింది. యూఎస్, యూరోపియన్ మార్కెట్లు శుక్రవారం ముగింపులో భారీగా పతనమయ్యాయి. డౌ జోన్స్ ఇండస్ట్రీయల్ కనీసం 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. జూన్ 24 తర్వాత ఇదే అతిపెద్ద సింగిల్ డే నష్టం. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు, దేశీయ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇటీవల రికార్డు స్థాయిల్లో నమోదవుతున్న స్టాక్ సూచీలు కరెక్షన్కు గురయ్యే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లాభాల స్వీకరణ చోటు చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు కొంత స్తబ్ధత లేదా క్షీణత ఉంటుందంటున్నారు.జూన్ 25న 7,940గా ఉన్న నిఫ్టీ సెప్టెంబర్ 8కు 9000లకు చేరువలోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో భారీ కరెక్షన్ చోటు చేసుకుంటుందని పేర్కొంటున్నారు.
మరోవైపు ఈ వారంలో వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలపై పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్లలో ఎక్కువగా దృష్టిసారించారు. అటు నేటి ట్రేడింగ్లో రూపాయి సైతం బలహీనపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 20 పైసల నష్టంతో 66.88గా ప్రారంభమైంది. అంతర్జాతీయ సంకేతాలతో రూపాయి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, నెగిటివ్గా ట్రేడ్ అవుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 66.50 నుంచి 67 శ్రేణిలో కదలాడే అవకాశమున్నట్టు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement