ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్పలాభాలతో ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో 27,941వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 8,638 వద్ద ముగిశాయి. ఆరంభ నష్టాలనుంచి మార్కెట్లు కోలుకుని దాదాపు 75 పాయింట్లకు పైగా ఎగిసినా చివరికి సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కీలక మద్దతు స్థాయికి దిగువనే ముగిశాయి. మెటల్, ఆటో, లాభాలు మార్కెట్ ను లాభాలవైపు నడిపించాయి. అలాగే పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ రంగాలు కూడా లాభపడ్డాయి.ముఖ్యంగా వివిధ కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రభావం ఆయా షేర్లలో కనిపించింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో నోయిడా టోల్ బ్రిడ్జ్ కంపెనీ షేర్లు35 శాతానికిపైగా కుప్పకూలాయి. మరోవైపు ఐషర్ మోటార్ కూడా అంచనాలను మించిన ఫలితాలను నమోదు చేసిన 413 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఐసీఐసీఐ, టీసీఎస్, ఇన్ఫోసిస్, సిప్లా, భారతి ఎయిర్ టెల్ నష్టపోగా బజాజ్ ఆటో, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, టెక్ మహీంద్రా లాభపడ్డాయి. ఐసీఐసీఐ టాప్ లూజర్ గా, టెక్ మహీంద్ర టాప్ గెయినర్ గా నిలిచింది.
'సంవాత్' కొత్త మార్కెట్ సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు దీపావళి పర్వదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం దీపావళి మూరత్ ట్రేడింగ్ ను గంటపాటు నిర్వహించనున్నట్టు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు వెల్లడించాయి. సాయంత్రం 6.30 నిమిషాలనుంచి ఈ ట్రేడింగ్ మొదలవుతుందని తెలిపాయి.
అటు 0.06 పైసల నష్టంతో రూ.66.81వద్దరూపాయి బలహీనందిగా ఉంది. మరోవైపు ధంతేరస్ సందర్భంగా బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రాముల పుత్తడి 72 రూపాయలు తగ్గి, రూ. 29,855 వద్ద వెలవెల బోతోంది.