కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారు
హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్అలీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనా అనుభవం లేకపోవడం వల్ల రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని ఆయన గురువారమిక్కడ అన్నారు. 7500 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని 18నెలల్లోనే కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా దిగజార్చరని షబ్బీర్ ధ్వజమెత్తారు.
కొన్ని ప్రభుత్వ అకౌంట్లు స్థంభింప చేశారని..దీనిపై తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ నేరవేర్చలేక పోయారని...ఇప్పటి వరకు 15 అంశాల్లో కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారని తెలిపారు. కేసీఆర్ తొందరపాటు నిర్ణయాల వల్ల పలు రంగాలు సంక్షోభంలో కూరుకుపోతుందని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.