బాంబే హైకోర్టును ఆశ్రయించిన షారుక్ ఖాన్
తనపై దాఖలైన పిటీషన్ను కొట్టివేయాలంటూ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. షారుక్ తన మూడో బిడ్డ తల్లిగర్భంలో ఉన్నప్పుడే లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక ఉద్యమకర్త వర్షా దేశ్పాండే కోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసులో షారుక్తో పాటు ఆయన భార్య గౌరి, జస్లోక్ ఆస్పత్రి, అందులో పనిచేసే వైద్యుడు, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులను ప్రతివాదులుగా చేర్చారు.
కాగా ఈ కేసు స్థానికి మేజిస్ట్రేట్ కోర్టులో ఇటీవల విచారణకు వచ్చినపుడు దేశ్పాండే కానీ ఆమె తరపు న్యాయవాది కానీ హాజరు కాలేదని షారుక్ న్యాయవాది ప్రణవ్ బండేకర్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఇంతకుముందు విచారణ నిర్వహించారని తప్పు చేసినట్టు ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలిపారు. కావున ఈ పిటీషన్ను తోసిపుచ్చాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న అనంతరం ఈ నెల 30లోగా అఫడవిట్ దాఖలు చేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.