నాదే తప్పు.. అందుకే ఓడిపోయాం: కెప్టెన్
ఇండోర్: కింగ్స్ పంజాబ్ ఎలెవన్ చేతిలో ఎదురైన అవమానకరమైన పరాభవానికి తానే కారణమని బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ జట్టు కెప్టెన్ షేన్ వాట్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓటమి నిందను తనపై వేసుకున్నాడు. ఇండోర్‌లో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒక దశలో 22 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బెంగళూరును డివీలియర్స్ ఆదుకున్నాడు. సుడిగాలి ఇన్నింగ్స్‌తో 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. కానీ అతను అంత మోత మోగించినా బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. 149 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు హషీమ్ ఆమ్లా (58), గ్లెన్ మాక్స్‌వెల్ (43) రాణించడంతో 14.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన బెంగళూరు సారథి.. ఓటమికి తనదే బాధ్యత అంటూ తనను తాను నిందించుకున్నాడు. ‘నేను బాగా బ్యాటింగ్ చేయలేదు. మొదటి ఓవర్‌లోనే నేను ఔటయ్యాను. కాబట్టి నన్ను నేను నిందించుకోక తప్పదు’ అని వాట్సన్ అన్నాడు. తమ జట్టు కనీసం 170-180 పరుగులు చేసి ఉంటే విజయాన్ని అందుకొని ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇక వరుసగా రెండు విజయాలతో ఊపుమీదున్న పంజాబ్ కెప్టెన్ గ్లెన్ మాక్స్‌వెల్ మాట్లాడుతూ తమ విజయం క్రెడిట్ బౌలర్లదేనని ప్రశంసించారు.