
నా తల్లి పిరికిది కాదు: సునంద కుమారుడు
న్యూఢిల్లీ: ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం తన తల్లికి లేదని సునంద పుష్కర్ తనయుడు శివ మీనన్ అన్నారు. శారీరకంగా తన తల్లిని హింసించేంత దేహ దారుఢ్యం శశి థరూర్కు లేదని పేర్కొన్నారు. 'అందరికి తెలియని విషయం ఏమిటంటే నా తల్లి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. సునందను హింసించేంత శారీరక బలం థరూర్ లేదని నమ్ముతున్నాను. నా తల్లి మరణానికి ఆయనే కారణమన్నది ఊహ మాత్రమే' అని మీనన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
థరూర్, సునంద అన్యోన్యంగా ఉండేవారని తెలిపారు. చిన్న చిన్న గొడవలు వచ్చినా వాటిని అధిగమించారని వెల్లడించారు. తన తల్లి మరణాన్ని అసాధారణమైందిగా చూడాలన్నారు. 21 ఏళ్ల శివ.. సుజీత్ మీనన్, సునంద తనయుడు. ఢిల్లీకి చెందిన సుజీత్ను సునంద రెండో పెళ్లి చేసుకున్నారు.