మాజీ మంత్రి శశిథరూర్ పై వేటు!
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ కొత్త చిక్కుల్లో పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఝలక్ ఇచ్చింది. మోదీ స్వచ్ఛ భారత్ ను స్వాగతించడం వల్ల శశిథరూర్ పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలపై వేటు వేసింది. ఆయన వ్యాఖ్యలు కేరళలోని కాంగ్రెస్ కు నష్టం కల్గించేవిధంగా ఉండటంతో ఆ రాష్ట్ర పార్టీ శ్రేణులు అధినేత్రి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశాయి. దీన్ని ఏఐసీసీ క్రమశిక్షణా ఉల్లంఘన కింద భావించిన అధిష్టానం అతన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
గత కొన్ని రోజుల క్రితం శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకులతో పాటు, కార్యకర్తల్లో ఆందోళన రేకెత్తించింది. దీంతో థరూర్ పై ఒక నివేదికను సిద్ధం చేసిన కేరళ పీసీసీ.. తాజాగా అధిష్టానానికి అప్పగించింది. ఈ అంశంపై వెంటనే స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం పార్టీ అధికార ప్రతినిధిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.