'థరూర్ పై వేటుకు ఓర్వలేనితనమే కారణం'
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ పై కాంగ్రెస్ వేటువేయడాన్ని బీజేపీ తప్పుబట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కు శశిథరూర్ మద్దతు తెలపడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోయిందని బీజేపీ సెక్రటరీ నాథ్ సింగ్ మండిపడ్డారు. ఈ తాజా ఉదంతం కాంగ్రెస్ ఓర్వలేనితనాన్ని బయటపెట్టిందని విమర్శించారు. మహత్మా గాంధీకి కలగన్న స్వచ్ఛ భారత్ కు మోదీ ఎంపిక చేసిన 9 మంది ప్రముఖుల పేర్లలో థరూర్ కూడా ఒకరని ఈ సందర్భంగా నాథ్ సింగ్ తెలిపారు.
శశిథరూర్ ఉదంతంతో ఎవరైనా మోడీ క్లీన్ ఇండియాకు మద్దతు తెలిపితే..వారిని తాము క్లీన్ చేస్తామని అన్న చందంగా కాంగ్రెస్ వైఖరి ఉందన్నారు. మోదీ స్వచ్ఛ భారత్ ను స్వాగతించడం వల్ల శశిథరూర్ పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన వ్యాఖ్యలు కేరళలోని కాంగ్రెస్ కు నష్టం కల్గించేవిధంగా ఉండటంతో ఆ రాష్ట్ర పార్టీ శ్రేణులు అధినేత్రి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశాయి. ఏఐసీసీ క్రమశిక్షణా ఉల్లంఘన కింద భావించిన అధిష్టానం అతన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.