తరార్‌తో సంబంధమేంటి?
పాక్ జర్నలిస్టు గురించి శశి థరూర్‌ను ప్రశ్నించిన మేజిస్ట్రేట్
భార్య మృతికి ముందు పరిస్థితులపై ఆరా
దర్యాప్తును వేగవంతం చేయాలంటూ షిండేకు శశి లేఖ
నన్ను కుట్రలో పావును చేశారు: తరార్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. మృతికి కారణాలు తెలుసుకునేందుకు ఒకవైపు పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు ఢిల్లీలోని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదివారం 8 మందిని ప్రశ్నిం చారు. వీరిలో సునంద భర్త శశి థరూర్, సోదరుడు రాజేశ్, జర్నలిస్టు నళిని సింగ్ కూడా ఉన్నారు. మీ భార్య మృతికి దారితీసిన పరిస్థితులు ఏమై ఉండొచ్చు? మరణానికి ముందు రోజుల్లో ఆమెకు, మీకు ఏమైనా గొడవలు జరిగాయా? లాంటి ప్రశ్నలతోపాటు.. పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్‌తో మీకేంటి సంబంధం? అని మేజిస్ట్రేట్.. శశి థరూర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. థరూర్‌కు, మెహర్ తరార్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందని ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన రెండు రోజుల తర్వాత సునంద మరణించిన సంగతి తెలిసిందే. మరణానికి ముందు కొద్ది రోజుల్లో ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలన్నింటినీ థరూర్ తన లిఖితపూర్వక వాంగ్మూలంలో మేజిస్ట్రేట్‌కు వివరించినట్లు తెలిసింది. వాంగ్మూలం అనంతరం థరూర్ మీడియాతో మాట్లాడ్డానికి నిరాకరించారు.
మరణానికి ముందు ఎవరితో మాట్లాడారు?
సునంద మరణించిన హోటల్ గది వద్ద సీసీటీవీ వీడియోను పరిశీలించిన పోలీసులు.. ఆమె వ్యక్తిగత సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ఆమె మరణించడానికి ముందు థరూర్‌తో వాగ్వాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరణానికి ముందు ఆమె ఎవరితో మాట్లాడారు? ఎవరికి ఎస్‌ఎంఎస్‌లు పంపారు లాంటివి ఆరా తీస్తున్నారు. సునంద మృతదేహానికి శవపరీక్ష చేసిన వైద్యులు సోమవారం మేజిస్ట్రేట్‌కు నివేదికిచ్చే అవకాశముంది.
దర్యాప్తును వేగవంతం చేయాలని షిండే లేఖ
తన భార్య మరణంపై మీడియాలో వస్తున్న కథనాలపై శశిథరూర్.. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఆదివారం లేఖ రాశారు. ‘నా భార్య మరణించిన విషాదంలో నేనుంటే.. ఆ మరణంపై రకరకాల ఊహాగానాలతో మీడియాలో పుంఖానుపుంఖాలుగా వస్తున్న వార్తలు నన్ను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరణానికి అసలు కారణమేంటో ముందు తెలియాలి. దీనిపై దర్యాప్తు వేగవంతం చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన లేఖలో కోరారు.
ఔషధం.. అధికమొత్తంలో తీసుకున్నారా!
అనుమానాస్పదంగా మరణించిన సునంద పుష్కర్ మృతదేహంలో ఎలాంటి ఆల్కహాల్ ఆనవాళ్లూ లభించలేదని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. అయితే మానసిక ఉద్రిక్తతను తగ్గించడానికి ఉపయోగపడే ఆల్ప్రాజోలం ఆనవాళ్లు లేకపోలేదని వివరించాయి.