టాటూతో తంటాలు..!
కొత్త సినిమా వచ్చినా... అభిమాన నాయకుడు గెలిచినా.. టీవీ సీరియల్ లో ఓ క్యారెక్టర్ కు కాస్త ఇంపార్టెన్స్ పెరిగినా ఇంకేముంది యూత్ ఒంటిపై ఆ టాటూ కనపడాల్సిందే. ఇటీవల బాహుబలి సినిమాకు విదేశాల్లోనూ మంచి క్రేజ్ లభించడంతో హీరో ప్రభాస్ టాటూ.. చైనాలో ఓ ఊపు ఊపింది. అలాగే ఒకానొక సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీపై తమ అభిమానం ప్రదర్శించాలనుకున్న ప్రజలు ఒంటిపై మోడీ పచ్చబొట్లను వేయించుకొన్నారు. ఇంతకీ ఈ టాటూల గొడవంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే టాటూలంటే అంత క్రేజ్ చూపించే యూత్ ప్రస్తుతం అవి చూసి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందట.
ఆకర్షణకోసం వేసుకున్న టాటూ న్యూయార్క్ కు చెందిన టిఫనీ పాస్టిరారో జీవితంలో ఓ పెద్ద అగాధాన్ని నింపింది. ఆమెకు సోకిన వింత వ్యాధి టాటూ వల్లనే అని తెలియడంతో ఆమెకు దగ్గరగా నిలబడేందుకు కూడ జనం భయపడుతున్నారు. విటిలిగో పేరున పిలుస్తున్న ఈ వ్యాధి ఆమెను ఎంతో ఇబ్బందికి గురి చేస్తోంది. ఈ వ్యాధి వ్యాప్తి కూడ చెందుతుండటం అందర్నీ వణికిస్తోంది.
చర్మవ్యాధితో బాధపడుతున్న పాస్టిరారో ఒంటినిండా తెల్లని, నల్లని మచ్చలు ఏర్పడ్డాయి. దీంతో ఆమెను అందరూ దూరంగా పెట్టడమేకాక, హేళనగా కూడ మాట్లాడుతున్నారంటూ బాధపడుతోంది. తన శరీరంపై ఏర్పడిన మచ్చలు కనపడకుండా ఉండేందుకు దట్టంగా మేకప్ వేసుకోవడం మొదలు పెట్టింది. అయితే అమెరికన్ టాప్ మోడల్స్ కంటెస్టెంట్ 2014 విన్నీ హార్లో ఓ టీవీలో శరీరంపై మచ్చలతో కనిపించడంతో పాస్టిరారో ఆశ్చర్యపోయింది. ఆమె మచ్చలు కనిపించకుండా ఉండేందుకు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడాన్ని ఓ సందర్భంలో ప్రశ్నించింది కూడ.
"విటిలిగో వ్యాధి సోకిన మరికొంతమంది కూడ ఉన్నారని నేను మొదటిసారి చూస్తున్నాను. మీకు కూడ ఈ వ్యాధి ఉందా? అని అడిగినప్పుడు ఆమె నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది. ఈ వ్యాధితో బాధపడుతున్న కొందరిని పరిచయం కూడ చేసింది." అంటూ పాస్టిరారో విన్నీహార్లోతో మాట్లాడిన అనుభవాలను పలువురితో పంచుకుంటోంది. అంతేకాదు ఓ పెద్ద టాటూను తన శరీరంపై ఏర్పడ్డ మచ్చలపై వేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉండే టాటూ అభిమానుల్లో అవగాహన కలిగిస్తోంది. మరో అడుగేసి తనగురించి ఫేస్ బుక్ లో వివరాలు పెట్టి టాటూవల్ల కలుగుతున్న నష్టంపై జనంలో చైతన్యం రావాలని ఆశిస్తోంది.
ఇంతకీ ఈ పచ్చబొట్లు ఎంత పురాతనమో తెలుసా! ఈ పచ్చబొట్ల చరిత్ర ఇప్పటిది కాదు... వేల సంవత్సరాల క్రితమే టాటూల సంప్రదాయం ఉన్నట్లు ఇటీవల బయటపడ్డ ఓ మమ్మీని బట్టి తెలిసింది. ఆ మమ్మీ శరీరంపై దాదాపు 61 టాటూలు ఉన్నట్లు గుర్తించారు. అంటే టాటూల క్రేజ్ జనంలో ఎంతగా ఉందో అర్థమౌతుంది.