
షీనా బోరా హత్య కేసులో సరికొత్త ట్విస్ట్
ముంబై:నగరంలో కలకలం రేపిన షీనా బోరా హత్య కేసులో ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు బయటపడుతున్నాయి. గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా కేసులో తాజాగా 'రాజీనామా లేఖ' ఒకటి వెలుగుచూడటం ఆసక్తికరంగా మారింది. షీనా బోరా హత్య కు గురైన కొన్ని రోజుల అనంతరం తాను పనిచేసే కార్యాలయంలో ఓ స్నేహితురాలికి రాజీనామా లేఖను పంపిందట. ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తున్న షీనా రాజీనామా లేఖపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.2012, ఏప్రిల్ 24వ తేదీన షీనా బోరా హత్యకు గురైతే.. అదే సంవత్సరం మే నెలలో తన రాజీనామా లేఖను ఆఫీసుకు పంపినట్లు తన ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. 1990 లో అస్పాం నుంచి తల్లి ఇంద్రాణి ముఖర్జీతో కలిసి ముంబైకు వచ్చిన షీనా బోరా.. ఆపై సెయింట్ ఎక్స్ వీర్ కళాశాలలో బీఏ ఎకనామిక్స్ చేసినట్లు పేర్కొన్నారు.
దాదాపు పది సంవత్సరాల అనంతరం 2011 జూన్ లో రిలయన్స్ ముంబై మెట్రో సంస్థలో ఉద్యోగం పొందిన షీనా బోరా . . కొన్ని రోజుల అనంతరం ఉద్యోగానికి పూర్తిగా రావడం మానేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ సంవత్సరమే తన ఫేస్ బుక్ అకౌంట్ ను కూడా క్లోజ్ చేసిందన్నారు.
2012వ సంవత్సరం ఏప్రిల్ 24 హత్య కు గురైన షీనా బోరా రాజీనామా లేఖపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. షీనా హత్య తేదీపై నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. అసలు ఆ లేఖను పంపిందెవరు?అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పరువు హత్య అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
2012లో హత్యకు గురైన షీనా బోరా కేసులో టీవీ మొగల్ స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణిని బుధవారం అరెస్టు చేశారు. స్టార్ ఇండియా 2002లో స్టార్ ఇండియా సీఈఓగా పీటర్ ఉన్నప్పుడు ఇంద్రాణిని పెళ్లాడాడు. అంతకుముందే ఇద్దరికీ జరిగిన వివాహాలకు విడాకులూ అయ్యాయి. అయితే ఆమెకు సిద్ధార్థ దాస్, సంజీవ్ ఖన్నాలతో తనకు జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని పీటర్ దగ్గర దాచింది. అనంతరం చోటు చేసుకున్నపరిణామాలు కూతురు షీనా బోరా హత్యకు దారి తీశాయి. ఆ విషయాన్ని దాచి పెట్టిన ఇంద్రాణి.. షీనా అమెరికాకు వెళ్లినట్లు అందర్నీనమ్మించింది. ఈ హత్య కేసులో ఇంద్రాణి పాత్ర ఉందని తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు.