కుటుంబ జీవనానికి స్వీడన్ ఉత్తమం
హెచ్‌ఎస్‌బీసీ సర్వేలో వెల్లడి
సింగపూర్: మాతృ దేశాన్ని వదిలి విదేశాల్లో నివసించేవారికి ఏ దేశం ఉత్తమం? కెరీర్ వృద్ధికి అవకాశాలు, ఆకర్షణీయమైన వేతనాలు, మెరుగైన జీవన ప్రమాణాల దృష్ట్యా సింగపూర్ అత్యుత్తమమని ఓ సర్వేలో వెల్లడైంది. 39 దేశాల్లో 21,950 మంది పరదేశీయులపై హెచ్‌ఎస్‌బీసీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది. ఆర్థికం (పర్సనల్ ఫైనాన్సెస్, కెరీర్ వృద్ధి), అనుభవం (జీవనశైలి, భద్రత), కుటుంబం (సామాజిక జీవితం, విద్య, పిల్లల సంరక్షణ) వంటి అంశాల ఆధారంగా ఆయా దేశాలకు ర్యాంకులు కేటాయించారు. హెచ్‌ఎస్‌బీసీ తరఫున ఈ ఏడాది మార్చి-మే మధ్యలో ఆన్‌లైన్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ YouGov ఈ సర్వే చేపట్టింది. ఓవరాల్‌గా సింగపూర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలువగా, భారత్ 17వ స్థానంలో నిలిచింది.
ముఖ్యాంశాలు..
* ఆకర్షణీయమైన వేతనాలు, కెరీర్ పురోగతి వంటి ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. 77 శాతం మంది ఇక్కడి ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేశారు. కెరీర్ వృద్ధికి ఈ దేశం సరైన గమ్యస్థానం అని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే ఓవరాల్‌గా మాత్రం ఈ దేశం పదో స్థానంలో ఉంది.
* ఆరోగ్యం, మెరుగైన జీవనానికి న్యూజిలాండ్ ఉత్తమమని తేలింది. ప్రతి పదిమందిలో ఎనిమిది మం ది తమ మాతదేశం కంటే ఇక్కడే మెరుగైన జీవితం గడుపుతున్నట్లు చెప్పారు. వేగంగా స్థిరపడడానికి కూడా ఈ దేశం బెస్ట్ చాయిస్ అని కితాబిస్తున్నారు.
* కుటుంబ జీవనానికి మాత్రం స్వీడన్‌కే ఎక్కువ మంది ఓటేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పిల్లల సంరక్షణ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు విద్యావకాశాలు సులభంగా ఉండడం, అదీ భరించగలిగే స్థాయిలో ఉండడంతో ఎక్కువ మంది ఈ దేశం పట్ల మొగ్గు చూపుతున్నారు. మాతృదేశం వదిలి ఇక్కడకు రావడం వల్ల పిల్లల జీవన స్థాయి పెరిగినట్లు 79 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.
* మెరుగైన జీవితం, ఒక కొత్త సవాల్‌గా తీసుకోవాలని ఎక్కువ మంది మాతృదేశం వదిలి విదేశాలకు వెళ్తున్నారు. 37 శాతం మంది ఈ కారణాలు చెప్పగా, 28 శాతం మంది ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చుకొనేందుకు వెళ్తున్నట్లు చెప్పారు.
* ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం, సంస్కృతి, వాణిజ్య వాతావరణం తదితర అంశాల దృష్ట్యా విదేశీయులు కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి లండన్, దుబాయ్, సింగపూర్, హాంగ్‌కాంగ్ దేశాలు ఉత్తమమని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.
సింగపూర్ ఎందుకు?
సింగపూర్‌లో నివసిస్తున్న విదేశీయుల్లో 28 శాతం మంది ఏడాదికి 2లక్షల డాలర్లకు (సుమారు రూ.1.32 కోట్లు)పైగా సంపాదిస్తున్నారు. కెరీర్ పురోగతికి ఇది సరైన స్థానమని 59 శాతం మంది అభిప్రాయపడగా, 79 శాతం మంది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేశారు. తమ మాతదేశం కంటే ఇక్కడే మెరుగైన జీవితం గడుపుతున్నట్లు 65 శాతం మంది చెప్పారు.
ఉపాధికి సింగపూర్ బెస్ట్
Published Mon, Sep 28 2015 10:24 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM
Advertisement
Advertisement