
వైట్‌హౌస్‌ను పేల్చేయాలి!
- సింగర్ మడోన్నా వివాదాస్పద వ్యాఖ్యాలు
- సోషల్ మీడియాలో విమర్శలు.. సమర్థించుకున్న సింగర్
అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికను వ్యతిరేకిస్తూ అమెరికా అంతటా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. శనివారం వాషింగ్టన్ డీసీలో ట్రంప్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ప్రముఖ పాప్ సింగర్ మడోన్నా ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్‌ను పేల్చేయాలని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలతో కంగుతిన్న టీవీ చానెళ్లు వెంటనే ఆందోళన లైవ్ ప్రసారాలను కాసేపు నిలిపివేశాయి. సోషల్ మీడియాలోనూ మడోన్నా వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. దీంతో మడోన్నా స్పందిస్తూ తన వ్యాఖ్యలు కేవలం ఉపమానయుక్తంగా చెప్పినవేనని అన్నారు.
’నేను హింసను కోరుకునే వ్యక్తిని కాను. నేను ఉపమానయుక్తంగా మాట్లాడాను. నేను రెండురకాల అభిప్రాయాలను వ్యక్తం చేశాను. ఒకటి ఆశాజనకమైన అభిప్రాయం కాగా, మరొకటి ఆగ్రహం, ఆవేశంతో కూడిన మనోభిప్రాయం మాత్రమే’ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. మహిళలపై తీవ్ర అసభ్యకర వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ విధానాలను ఎదుర్కోవడానికి స్త్రీలందరూ సిద్ధంగా ఉన్నారని మహిళా ఆందోళనకు నేతృ త్వం వహించిన మడోన్నా పేర్కొన్నారు.