ఒకే విడతలో రుణమాఫీ చేయాలి
సాక్షి, హైదరాబాద్ : రుణమాఫీపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా శాసనసభను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ విపక్ష సభ్యులు బుధవారం రాత్రి అసెంబ్లీలో బైఠాయించారు. ఒకే విడతలో రుణ మాఫీ చేస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐలకు చెందిన ఎమ్మెల్యేలు వాయిదా పడిన తర్వాత గంటపాటు సభలోనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ప్రతిపక్ష నేత కె.జానారెడ్డితోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి, బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్, వైఎస్సార్ కాంగ్రెస్ నేత పాయం వెంకటేశ్వర్లు, సీపీఎం నేత సున్నం రాజయ్య, సీపీఐ నేత రవీంద్రకుమార్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు సభలో నినాదాలు చేశా రు. కొద్దిసేపటికి భద్రతా సిబ్బంది లాబీల్లో ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు పంపించి, తలుపులు వేశారు. వాయిదా తర్వాత సభలో ఉండొద్దని, బయటకు వెళ్లాల్సిందిగా భద్రతా సిబ్బంది చేసిన సూచనను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. అనంతరం వారందరినీ బలవంతంగా బయటకు తరలించడానికి పోలీసు వాహనాలను తెప్పించారు.
వేర్వేరు వాహనాల్లో వెళ్లం
కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలను వేర్వేరుగా తరలించడానికి వాహనాలను తెప్పిం చారు. అయితే వేర్వేరు వాహనాల్లో వెళ్లడానికి జానారెడ్డి, కిషన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, డీకే అరుణ తదితరులు నిరాకరించారు. ఆ వాహనాలను కూడా గేట్ నంబర్ 1(ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లే దారి) నుంచి కాకుండా ఎమ్మెల్యేలు వచ్చే రెండో నంబర్ గేటు నుంచి తీసుకు వెళ్లాలని జానారెడ్డి వాదించారు. పోలీసులు తమ ఇష్టం వచ్చినట్టు తీసుకువెళ్లడానికి వీల్లేదని, ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తారా అంటూ డీసీపీ కమలాసన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గేటు నంబర్ 2 వద్ద మీడియా ప్రతినిధులు ఉన్నందున గేటు నంబర్ 1 నుంచి తీసుకువెళ్తున్నామని కమలాసన్ రెడ్డి చెప్పారు. అందరినీ గాంధీభవన్ దగ్గర దించాలని ముందుగా అనుకున్నారు. అయితే గాంధీభవన్ దగ్గరకు వెళ్లడానికి టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ఇబ్బందిపడతారనే కారణంతో అందరినీ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్ల దగ్గర దింపేశారు. శాసనసభలో బైఠాయించిన ఎమ్మెల్యేలను బయటకు తరలించే వ్యవహారం పూర్తయ్యే దాకా మంత్రులు టి.హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభలోనే ఉన్నారు.
సీఎంది బాధ్యతారాహిత్యం:ఎమ్మెల్యేలు
రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయకుండా, రైతుల ఆత్మహత్యలను పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, డి.కె.అరుణ, బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి విమర్శించారు. కీలకమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోవడం ఏమిటని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఒకే విడతలో రుణమాఫీ చేసే దాకా సభను నడువనిచ్చేది లేదని స్పష్టంచేశారు.