చెత్తబుట్టలో సీఆర్పీఎఫ్ జవాన్ల యూనిఫామ్స్
రాయపూర్: ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లకు చెందిన యూనిఫామ్స్, బూట్లు ఆస్పత్రి చెత్తకుప్పలో పడేయడం బుధవారం వివాదానికి దారి తీసింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన జవాన్లను అవమానిస్తారా అంటూ ఆందోళన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రక్తంతో తడిసిన జవాన్ల బట్టలు, బూట్లలను డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ మెమోరియల్ ఆస్పత్రిలోని శవాల గది వద్ద చెత్తబుట్టలో పడేశారు. విషయం తెలుసుకున్న సుక్మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వికాస్ ఉపాధ్యాయ్, ఇతర నేతలు ఆస్పత్రిని సందర్శించారు. చెత్తబుట్టలో పడేసిన బట్టలు, 10 జతల బూట్లను వారు కాంగ్రెస్ భవన్ కు తీసుకెళ్లారు. తర్వాత సీఆర్పీఎఫ్ అధికారులు కాంగ్రెస్ భవన్ కు వెళ్లి వాటిని తీసుకున్నారు. సోమవారం చింతగుపా వద్ద మావోయిస్టులు జరిపిన దాడిలో 14 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన సంగతి విదితమే.