‘రేపిస్టులకు నరాలు కోసేయాలి’
న్యూఢిల్లీ: రేపిస్టులకు మరణశిక్ష విధించాలని ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) అధ్యక్షురాలు స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. కఠిన శిక్షలు అమలు చేయడం ద్వారా మాత్రమే మహిళలపై దారుణాలకు అడ్డుకట్ట పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. గురుగ్రామ్‌లో సిక్కిం రాష్ట్రానికి చెందిన యువతిపై కదిలే కారులో ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూడడంతో ఆమె స్పందించారు.
‘దేశంలో ప్రతి నిమిషానికి ఒక రేప్ జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రేపిస్టుకి మరణశిక్ష విధించడం ద్వారా జాతికి భారత ప్రభుత్వం గట్టి సందేశం పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. అత్యాచారాలకు అడ్డుకట్ట పడాలంటే రేపిస్టుల నరాలు కోసేయాలి. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వరమే న్యాయం అందించి, రేపిస్టులకు మరణశిక్ష అమలు చేయడమే సముచితమ’ని స్వాతి మలివాల్ పేర్కొన్నారు. కాగా, హర్యానాలోని రొహతక్ జిల్లాలో శనివారం రాత్రి 23 ఏళ్ల యువతిని సామూహిక అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచనలం రేపింది.