రూ. 82 కోట్ల విలువైన పాము విషం పట్టివేత
సిలిగురి: పశ్చిమ బెంగాల్‌లో పాము విషం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. తాజాగా రెండు ఘటనల్లో రూ. 82 కోట్ల విలువ చేసే పాము విషాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాము విషాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను డార్జిలింగ్ జిల్లాలో పట్టుకున్నారు. శషస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ) సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకుని పాము విషంతో కూడిన రెండు జాడీలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో రూ. 70 కోట్లు ఉంటుందని అంచనా చేశారు. నిందితులను విచారిస్తున్నామని ఎస్‌ఎస్‌బీ 41బీఎన్ కమాండెంట్ రాజీవ్ రాణా తెలిపారు.
దక్షిణ దినాజ్‌పూర్‌లోని సోమవారం రాత్రి రూ. 12 కోట్ల విలువ చేసే పాము విషాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంగారాంపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫుల్బరీ-ప్రాణసాగర్ ప్రాంతంలో అటవీ అధికారులతో కలిసి ఎస్‌ఎస్‌బీ, బీఎస్‌ఎఫ్ నిర్వహించిన దాడుల్లో రెండు జాడీల్లో దాచిన పాము విషాన్ని కనుగొన్నారు. నిందితుడొకరిని అరెస్ట్ చేశారు.
ఔషధాలు, సౌందర్య సాధనాలు తయారు చేయడానికి ఉపయోగించే పాము విషానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఒక్క గ్రాము విలువ లక్ష రూపాయలు పైగా ఉంటుందని అంచనా. ప్రపంచంలో ఏ దేశంలో జరగనంతగా ఒక్క భారత దేశంలోనే పాము విషం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ పాము విషం అక్రమ రవాణా చాలా ఎక్కువ. పాము విషం స్మగ్లింగ్ చేస్తూ నిందితులు పట్టుబడడం బెంగాల్‌లో సాధారణంగా మారింది.