వామ్మో! పాము విషానికి అంత రేటా? | How much is snake venom worth? | Sakshi
Sakshi News home page

వామ్మో! పాము విషానికి అంత రేటా?

Published Mon, Oct 31 2016 6:36 PM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

వామ్మో! పాము విషానికి అంత రేటా? - Sakshi

వామ్మో! పాము విషానికి అంత రేటా?

కోల్‌కతా: ప్రపంచంలో ఏ దేశంలో జరగనంతగా ఒక్క భారత దేశంలోనే పాము విషం స్మగ్లింగ్‌ ఎక్కువగా జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో పోలీసులు ఇటీవల నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి ఐదు గాజు పాత్రల్లో స్మగ్లింగ్‌ చేస్తున్న పాము విషం పొడిని స్వాధీనం చేసుకున్న సంఘటన ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తోంది. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 245 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు ప్రకటించారు.

అయితే దాని విలువ 175 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుందని జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. పత్రికలు వెల్లడించిన కథనాలనే నమ్మినట్లయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న వెయ్యి గ్రాములకు లెక్కకడితే  ఒక్క గ్రాము విలువ 1,75,000 రూపాయలు ఉంటుందని తేలుతోంది. ఇదే విషయాన్ని పోలీసులను అడిగితే ఆ మాత్రం విలువ ఉంటుందని వారూ తెలిపారు. అందుకే వాటిని బుల్లెట్‌ ప్రూఫ్‌ గాజు పాత్రల్లో స్మగ్లింగ్‌ చేస్తున్నారని కూడా చెప్పారు.

పాము విషయం విలువ అంత ఉంటుందా? ఎవరు అంత విలువు పెట్టి కొంటారు. ఎందుకు కొంటారు? అంతర్జాతీయ మార్కెట్‌లో సాధారణ నాగుపాము విలువ గ్రాముకు పది వేల రూపాయలు మాత్రమే ఉంది. ఎక్కువ విషాన్ని ఇచ్చే కింగ్‌ కోబ్రా నుంచి తీసే విషం గ్రాము విలువ తొమ్మిదివేల రూపాయలు మాత్రమే ఉంది. తాము స్వాధీనం చేసుకున్న పాము విషం గాజు పాత్రలపై వైద్య అవసరాల కోసం తయారు చేసినట్లు ఫ్రెంచ్‌ కంపెనీ గుర్తులున్నాయని పోలీసులు తెలిపారు. వారు చెబుతున్నట్లుగా  ప్రపంచ వ్యాప్తంగా ఔషధాల్లో ఈ విషాన్ని వాడతారనే విషయం మనందరికి తెల్సిందే.

ముఖ్యంగా పాముకాటుకు విరుగుడు మందును తయారు చేయడానికే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పాము కాటకు విరుగుడుగా ఇచ్చే యాంటీ వీనమ్‌ ఇంజెక్షన్‌ సీసా రేటు భారత్‌ మార్కెట్లో వెయ్యి రూపాయలకే లభిస్తోంది. అందులో విషం పాళ్లు తక్కువగానే ఉంటుంది. భారత ఔషధ కంపెనీలు పోలీసులు చెబుతున్నట్లుగా 1,75,000 రూపాయలకు గ్రాము విషాన్ని కొన్నట్లయితే వారు యాంటీ వీనమ్‌ వాయిల్‌ను వెయ్యి రూపాయలకు ఎలా సరఫరా చేస్తారు? అంతర్జాతీయ మార్కెట్‌లో చైనా గ్రాము విషాన్ని 4,500 రూపాయలకు విక్రయిస్తోంది. పైగా ప్రస్తుత మార్కెట్‌ అవసరాలకు వెయ్యి గ్రాముల పాము విషం అవసరం లేదు. బుల్లెట్‌ ప్రూఫ్‌ గాజుల్లో ఆ పాము విషం పొడిని సరఫరా చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు.
పైగా అన్ని రకాల పాముల విషాలను కలిపినట్లయితే అవి మందుల తయారీ కంపెనీలకు ఎందుకూ పనికిరావు. ఎందుకంటే ఒక్కో జాతి పాము విషయం వారికి వేర్వేరుగా కావాలి.

తాచు పాము విషాన్నే భారత ఔషధ కంపెనీలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ‘ఇరులా స్నేక్‌ క్యాచర్స్‌ కోపరేటివ్‌’ అనే సంస్థ ఎంతో కాలంగా అధికారికంగా భారత ఔషధ కంపెనీలకు  అవసరమైన విషాన్ని సరఫరా చేస్తోంది. పది కిలోల తాచుపాము విషాన్ని సేకరించాలంటే 35వేల పాముల నుంచి 35 ఏళ్లు సేకరిస్తే వస్తుందని ఆ సంస్థ తెలియజేస్తోంది. పాము విషం ఆరుదైనప్పటికీ గ్రాము విలువ లక్షల్లో ఉంటుందని అనుకోవడం అతిశయోక్తేనని ఆ సంస్థ తెలిపింది.

పైగా ఫ్రెంచ్‌ కంపెనీ పేరు స్మగ్లింగ్‌ సీసాలపై ముద్రించి ఉన్నట్లు పోలీసులే చెబుతున్నారు. అలాంటప్పుడు భారత ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు నేరుగానే వాటిని దిగుమతి చేసుకోవచ్చు. వాటిని స్మగ్లింగ్‌ చేయాల్సిన అవసరమేలేదు. పాము విషం అన్నది వన్య జంతువుల సంరక్షణ చట్టం కిందకు వస్తోంది. మన దేశం దాటితే ఈ చట్టం ఎవరికి వర్తించదు. అలాంటప్పుడు ఫ్రెంచ్‌ పాముల విషాన్ని పట్టుకునే హక్కే మన పోలీసులకు లేదు.

ఆ....రేవు పార్టీల్లో, మత్తు ఎక్కడానికి కుర్రకారు ఈ విషాన్ని అక్రమంగా వినియోగిస్తున్నారని, అందుకనే దీనికి ఇంతరేటు పలుకుతున్నట్లు ఉందని పోలీసులు చెబుతున్నారు. కొకైన్, హెరాయిన్‌ లాంటి మత్తు పదార్థాలకు కొంతమంది కుర్రవాళ్లు బానిలవుతున్న విషయం కూడా తెల్సిందే. ప్రపంచంలో ఎక్కడా గ్రాము కొకైన్‌ తొమ్మిదివేల రూపాయలకన్నా ఎక్కువ ధరలేదు. అలాంటప్పుడు లక్షల రూపాయలు పెట్టి పాము విషాన్ని ఎందుకు కొంటారు?  అంతేకాకుండా పాము విషాన్ని తాగినట్లయితే కడుపులోని ఆమ్లాలు ఆ విషాన్ని వెంటనే నిర్వీర్యం చేస్తాయి. ఎలాంటి ప్రభావం ఉండదు. అల్సర్లు ఉంటే ప్రమాదం. ఎందుకంటే పాము విషం చాలా వేగంగా నరాల వ్యవస్థ, జన్యు వ్యవస్థను దెబ్బతీస్తాయి. రక్త ప్రసారాన్ని కూడా అడ్డుకుంటాయి. అందువల్ల మనుషులకు ప్రాణం పోవడం లేదా పక్షవాతం రావడం జరుగుతుంది.

భారత దేశంలో ఏటా 45వేల మంది పాము కాటు వల్ల చనిపోతున్నారు. వారిలో ఒక్కరు కూడా తాము ఒకవిధమైన మత్తులో తేలిపుతున్న భావాన్ని వ్యక్తీకరించలేదు. భరించలేని బాధ తప్ప. ఇలాంటప్పుడు పాము విషం పేరుతో కొకైన్‌నే సరఫరా చేస్తున్నారా? ఎందుకంటే చూడడానికి పాము విషం పొడి, కొకైన్‌ పొడి ఒకేలా ఉంటాయి. కొకైన్‌తో దొరికిపోతే శిక్షలు పెద్దగా ఉంటాయి కనుక, పాము విషమని స్మగ్లర్లు నమ్మిస్తున్నారా? లేదా పోలీసులే చౌక ప్రచారం కోసం ఇన్ని కోట్ల విలువైన పాము విషాన్ని పట్టుకున్నామని చెబుతున్నారా? ఏదీమైనా తాము పట్టుకున్న పదార్థాన్ని ల్యాబ్‌ పరీక్షకు పంపించి అదేమిటో తేలాక పోలీసులు వాస్తవాలను పత్రికలకు వెల్లడిస్తే బాగుంటుంది.

snake venom, smuggling, Cobra, anti venom injection, పాము విషం, స్మగ్లింగ్, కొకైన్, యాంటీ వీనమ్ ఇంజెక్షన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement