రోదించిన ఫేస్ బుక్.. విలపించిన ట్విట్టర్
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
నా గుండె కలుక్కుమంది. అవును.. నా గుండె రక్తనాళాల్లో కలాం రూపొందించిన స్టెంట్ ఉంది. ఆయన లేరనగానే ప్రాణంలేని ఆ స్టెంటు కూడా బాధతో మూలిగింది. అందుకే కాబోలు.. నా గుండె కలుక్కుమంది
మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
నా దృష్టిలో నువ్వే.. ఓ భారతదేశం
నా కళ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. ముందు ఏముందో, టీవీలో ఏం చూపిస్తున్నారో కూడా కనపడటం లేదు.. నిజంగా బ్లాక్ డే. స్వామి వివేకానంద తర్వాత భారతీయ యువతలో స్ఫూర్తి రగిలించింది అబ్దుల్ కలామే.
ఆయన కుప్పకూలారేగానీ, ఆయన సృష్టించిన మిసైల్స్ ఏనాడూ కూలలేదు. సలాం సర్
..... సాధారణంగా ఎవరైనా మరణిస్తే వెంటనే వాళ్ల పేరుతో ‘రిప్’ అనే రెండక్షరాలతో సరిపెట్టేసే ఫేస్ బుక్ కమ్యూనిటీలో సోమవారం రాత్రి నుంచి వెల్లువెత్తుతున్న సందేశాలలో ఇవి కొన్ని మాత్రమే. అబ్దుల్ కలాం అస్వస్థతకు గురైనట్లు తెలిసినప్పటి నుంచి ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్.. ఇలా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆందోళన, ఆవేదన. ‘‘దేవుడా ఇప్పటికే లెక్కలేనన్ని దుర్వార్తలు వినిపించావు. ఈ ఒక్కసారీ కరుణించు.. ఆ మహానుభావుడిని బతికించు’’ అంటూ ట్విట్టర్ లో లెక్కలేనన్ని ట్వీట్లు వచ్చాయి. మొట్టమొదటి సారి ఓ జాతీయ చానల్లో రిపోర్టర్ ఆయన ఇక లేరంటూ చెప్పబోతుండగానే న్యూస్ రూంలో ఉన్నవాళ్లు కట్ చేసినప్పుడు కూడా ‘స్వామీ ఇది నిజం కాకూడదు.. ఇప్పుడైనా ఈ వార్త తప్పని చెప్పించు’ అంటూ కన్నీరు పెట్టారు.
ఎలాంటి సందర్భంలోనైనా కూడా పెద్దగా బాధ్యత లేనట్లు, పొడిపొడిగా అరకొర మాటలతో, సంకేతార్థాలతో వినిపించే, కనిపించే సోషల్ మీడియా.. కలాం విషయంలో మాత్రం చాలా భిన్నంగా కనిపించింది. మంగళవారం ఉదయం ఎవరి ఫేస్ బుక్ అకౌంట్ తెరిచినా.. ఎన్ని స్క్రోల్స్ కిందకు వెళ్లినా.. ఒకటే విషయం.. కలాం సార్ కి సలాం. ఆయన చివరి నిమిషంలో స్టేజి మీద కుప్పకూలిన ఫొటోను షేర్ చేసినవాళ్లు లెక్కలేనంత మంది. పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలను ఫొటోల రూపంలో చూపించినవాళ్లూ ఉన్నారు. ఇంకా పెద్ద విశేషం ఏమిటంటే.. చాలామంది తమ ప్రొఫైల్ పిక్చర్స్ కూడా అబ్దుల్ కలాం ఫొటోతో మార్చేసుకున్నారు.
వాట్సాప్ లో కూడా సోమవారం రాత్రి ఆయన మరణించిన విషయం దావానలంలా వ్యాపించింది. ఒకరి నుంచి మరొకరికి, అక్కడినుంచి గ్రూపుల్లోకి.. అలా అలా.. టీవీలు చూడనివాళ్లకు కూడా ఈ విషయం క్షణాల్లో తెలిసిపోయింది. ఒక్కసారిగా అంతా నివ్వెరపోయారు. మన తరానికి బాగా తెలిసిన, ఈ తరం మొత్తానికి తన స్వప్న సందేశాలతో స్ఫూర్తి రగిలించిన ఆ మహానుభావుడు ఇక లేడనగానే మూగగా రోదించారు. తమకూ మనసుందని, సందర్భం వస్తే అది కూడా చలిస్తుందని నిరూపించారు.