పన్నులలో మరికొన్ని మినహాయింపులు ఇలా..
సంవత్సరానికి 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను రేటును కొంతవరకు తగ్గించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. మరికొన్ని రకాల మినహాయింపులను కూడా ప్రకటించారు. అవి ఇలా ఉన్నాయి...
5 లక్షల రూపాయల వార్షికాదాయం దాటని వ్యక్తులకు సెక్షన్ 87 ఎ కింద పన్ను మినహాయింపు ప్రస్తుతం రూ. 2వేలు మాత్రమే ఉండగా, దాన్ని ఇప్పుడు 5 వేలకు పెంచారు. దాంతో దాదాపు 2 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఒక్కొక్కరికి రూ. 3వేల చొప్పున ఊరట లభిస్తుంది.
సొంత ఇళ్లు ఉన్నవారికి గృహరుణాల మీద చెల్లించే అసలు, వడ్డీకి ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ సొంత ఇళ్లు లేకుండా అద్దె ఇళ్లలో ఉండేవారికి వారు ఏడాదికి చెల్లించే అద్దె మీద పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80జిజి కింద ఇప్పటివరకు ఏడాదికి 24 వేల రూపాయల వరకు కట్టే అద్దె మీద పన్ను మినహాయించేవారు. ఈ పరిమితిని ఇప్పుడు రూ. 60 వేలకు పెంచారు.
ఇప్పటివరకు కోటి రూపాయల వార్షిక టర్నోవర్ దాటని చిన్న, మధ్యతరహా నాన్ కార్పొరేట్ వ్యాపారులకు సెక్షన్ 44ఎడి కింద ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్కీం అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం 33 లక్షల మంది చిన్న వ్యాపారులు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే, వాళ్లు ఖాతా పుస్తకాలను వివరంగా నిర్వహించాల్సి రావడం, ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ టర్నోవర్ పరిమితిని ఇప్పుడు 2 కోట్ల రూపాయలకు పెంచారు. దాంతో మరింతమంది వ్యాపారులు ఎంఎస్ఎంఈ విభాగంలోకి వస్తారు.
50 లక్షల రూపాయల వరకు స్థూల ఆదాయం వచ్చే వృత్తి నిపుణులకు కూడా ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్కీంను అందుబాటులోకి తెచ్చారు.