'అందమైన ఆడవాళ్లు అర్థరాత్రులూ తిరగాలంటే..'
న్యూఢిల్లీ: అర్థరాత్రి ఆడవాళ్లు ఒంటరిగా తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లన్న మహాత్ముడి ప్రవచనానికి వక్రభాష్యమిచ్చి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు ఘనత వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి. ' ఢిల్లీ నగరంలో అందమైన మహిళలు అర్థరాత్రి స్వేచ్చగా తిరగాలంటే.. పోలీస్ వ్యవస్థ మొత్తం ఆప్ సర్కారు ఆధీనంలోకి రావాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది' అని అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన కామెంట్లపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి.
ఈ మాజీ మంత్రి కామెంట్లపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నాయకురాలు శర్మిష్ఠ ముఖర్జీ.. ' సోమనాథ్ మాటలు వికారం తెప్పిస్తున్నాయి. ప్రతి అక్షరం మహిళలను కించపర్చేలా ఉంది. న్యాయమంత్రిగా ఉంటూ చట్టవ్యతిరేక కార్యమాలు చేసి అడ్డంగా దొరికిపోయన ఆయన ఇంతకంటే మంచిగా మాట్లాడతారని అనుకోవడం తప్పే అవుతుంది' అని వ్యాఖ్యానించారు. అటు బీజేపీ కూడా సోమనాథ్ కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
విమర్శలకు స్పందించిన సోమనాథ్.. 'ఒంటినిండా నగలు ధరించిన ఓ అందమైన వనిత నడిరాత్రి స్వేచ్ఛగా బయట తిరగడం.. మహిళల రక్షణకు సంబంధించినంతవరకు గొప్ప విషయం కాదా. పోలీసులు మా చేతుల్లో ఉంటే అలాంటి పరిస్థితులు కల్పిస్తామని చెప్పడమే నా ఉద్దేశం' అని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాల్లో ఇరుక్కొని జైళ్లదాకా వెళ్లొచ్చారు. సోమ్ నాథ్ తెచ్చిపెట్టిన కొత్త తలనొప్పిని పార్టీ ఎలా భరిస్తుందో వేచిచూడాలి.