యూపీ ఎన్నికల ప్రచారానికి సోనియా దూరం
న్యూఢిల్లీ: పొత్తు అందించిన ఉత్సాహంతో ఉత్తరప్రదేశ్‌లో గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్-సమాజ్‌వాదీ కూటమికి మరో శరాఘాతం. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోరని ఆ పార్టీ వర్గాలు మంగళవారం సంకేతాలిచ్చాయి. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.. కూటమి తరఫున ప్రచారం చేయబోనని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోనియా కూడా ప్రచారానికి దూరం కానున్నారు. దిగ్గజ నేతల గైర్హాజరీ ఓటర్లపై ఏమేరకు ప్రభావం చూపుతుందోనని కూటమిలో కలవరం మొదలైంది.
అనారోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గత ఏడాది అమెరికాలో చికిత్స చేయించుకున్న అనంతరం సోనియా తరచూ అనారోగ్యానికి గురవుతున్న సంగతి తెలిసిందే. కొద్ది నెలల కిందట కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా ప్రారంభించిన ప్రచార ర్యాలీ పాల్గొన్న సోనియా కొద్ది నిమిషాలకే అనారోగ్యానికి గురై ఢిల్లీకి తిరిగివెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
అందరికంటే నాన్నే సంతోషిస్తారు: అఖిలేశ్
సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం అఖిలేశ్ యాదవ్ మంగళవారం జలేసర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ సమాజ్‌వాదీ-కాంగ్రెస్ కూటమే ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘మన పార్టీ తప్పక గెలుస్తుంది. ఆ గెలుపుతో అందరికంటే నాన్నే(నేతాజీనే) సంతోషపడతారు’అని అఖిలేశ్ అన్నారు.