సోనీ పిక్చర్స్ చేతికి టెన్ స్పోర్ట్స్?
Published Mon, Aug 8 2016 11:28 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM
ముంబై: సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా త్వరలో జీ టీవికి చెందిన టెన్ స్పోర్ట్స్ ను సొంతం చేసుకోనుంది. టెలివిజన్ మొఘల్ సుభాస్ చంద్ర ఆధ్వర్యంలోని జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జెఇఈల్)కు చెందిన టెన్ స్పోర్ట్స్ ను సోనీ స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. దాదాపు రూ.2000కోట్ల రూపాయలకుసోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా దీన్ని కొనుగోలు చేయనున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2006లో దుబాయ్ టాటా గ్రూపునకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ బుఖాతిర్ నుంచి దీన్ని సుభాష చంద్ర కొనుగోలు చేశారు.
రెండు నెలలక్రితం ప్రారంభమైన చర్చలు, రెండు వారాల క్రితం మరింత వేగమయ్యాయని దీంతో ఇది ఒక కొలిక్కి వచ్చాయని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే మరో రెండు మూడువారాల్లో దీనిపై అధికారిక ప్రకటన రావచ్చని వెల్లడించాయి. అయితే ఈ వార్తలపై సోనీ ప్రతినిధిని సంప్రదించగా స్పందించడానికి నిరాకరించారు. ఇది పాలసీకి సంబంధించిన అంశమంటూ ఊహాగానాలపై వివరించాడానికి వ్యతిరేకించారు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ మిహిర్ మోడీ.
కాగా మల్టీ స్క్రీన్ మీడియా (ఎంఎస్ఎం ) గా పేరుపొందిన సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ భాషల్లో అనేక చానల్స్ ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ చానల్స్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్, పిల్లల విభాగాల్లో తనదైన హవాను చాటుకుంటూ కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. ఈ అంచనాలు వాస్తవరూపం దాలిస్తే 21 వ సెంచరీ ఫాక్స్ సొంతమైన స్టార్ ఇండియా, జపనీస్ దిగ్గజం సోనీ కార్ప్ సొంతమైన సోనీ పిక్చర్స్ భారతదేశంలో స్పోర్ట్స్ ప్రసార విభాగాల్లో ఏకాధిపత్యం సాధించినట్టేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Advertisement