ఓ.. ఎల్‌ఈడీ! ఎక్కడున్నావ్?
న్యూఢిల్లీ: సీఆర్‌టీ, ఫ్లాట్, ప్లాస్మా, ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ... ఇవన్నీ ఏంటో తెలుసా? ఒకదాని తరవాత ఒకటిగా మన ఇళ్లను ఏలేసిన టీవీ మోడళ్లు. సీఆర్‌టీ టీవీల తరవాత వచ్చిన ఫ్లాట్ టీవీలు కొన్నాళ్లపాటు దుమ్ము దులిపాయి. తరవాత ప్లాస్మా వచ్చినా కొన్నాళ్లకే మసకబారింది. ఆ తరవాత వచ్చిన ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీలు ఇప్పటికే మన ఇళ్లను, కళ్లను అలరిస్తూనే ఉన్నాయి. వీటిని తలదన్నేలా ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఓఎల్‌ఈడీ) టీవీల్ని తేవాలని పెద్ద కంపెనీలన్నీ చాలా పెద్ద ప్రణాళికలేశాయి. కాకపోతే పరిస్థితులు చూస్తుంటే ఇవి పురిట్లోనే సంధికొట్టేసేలా ఉన్నాయి.
ఎందుకంటే వీటి తయారీకి భారీ వ్యయం అవుతుండటం, కొత్త టెక్నాలజీపై జనంలో ఇంకా నమ్మకం ఏర్పడకపోవటంతో వీటిపై అనుమానాలు రేగుతున్నాయి. మెరుగైన టెక్నాలజీతో, అందుబాటు ధరలో ఓలెడ్ టీవీలు తేవాలని పరిశ్రమ దిగ్గజాలు సోనీ, పానాసోనిక్ ఇప్పటికే ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. కాకపోతే దానికి డిసెంబరు 31తో గడువు ముగిసిపోయింది. పొడిగించుకునే ప్రయత్నాలేవీ కంపెనీలు చేయకపోవటం ఈ సందర్భంగా గమనార్హం. అధిక ధర, విశ్వసనీయత కొరవడటం వంటి కారణాల వల్ల టీవీ ఉత్పత్తిదారులు ఓలెడ్ టీవీలకు బదులు అల్ట్రా హెచ్‌డీ టీవీలవైపే మొగ్గు చూపిస్తూ వస్తున్నారు. లిక్విడ్ క్రిస్టల్ టెక్నాలజీతో తయారయ్యే వీటి రిజల్యూషన్ ప్రస్తుత హై డెఫినిషన్ స్క్రీన్ల కంటే నాలుగు రెట్లు మెరుగ్గా ఉంటుంది.
నిజానికి ఎల్‌జీ, శామ్‌సంగ్‌లు తయారు చేస్తున్న 55 అంగుళాల ఓలెడ్ టీవీలు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. కొన్ని చోట్ల వీటి ఆరంభ ధర 8 వేల డాలర్లు. అయితే ఎల్‌జీ సంస్థ భారతదేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన 55 అంగుళాల ఓలెడ్ కర్వ్‌డ్ టీవీని ఇటీవలే హైదరాబాద్‌లో కూడా ప్రదర్శనకు పెట్టింది. దీని ధర అక్షరాలా పది లక్షలు. ఎల్‌జీ బెస్ట్ షాపులన్నిట్లోనూ ఇది దొరుకుతుందంటూ దీన్ని మార్కెట్లోకి విడుదల చేశారు కూడా. ఓలెడ్ టీవీల ధర ఎక్కువ కావటంతో వీటిని తక్కువ ధరలోనే ఉత్పత్తి చేయడానికి సోనీ, పానాసోనిక్‌లు 2012లో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఉత్పత్తి మొదలు కాకముందే గత నెలతో దీని గడువు ముగిసింది. ఉత్పత్తి వ్యయం, టెక్నాలజీ సంబంధ సమస్యలను అధిగమించగలిగితే అత్యంత స్పష్టమైన చిత్రాలను చూపే ఓలెడ్ టీవీలను ప్రజలు ఆదరించగలుగుతారు. మరి ఆ అవకాశం వస్తుందా..?