ఐసీసీ నుంచి దక్షిణాఫ్రికా ఔట్
దక్షిణాప్రికా సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) నుంచి వైదొలుగుతున్నట్టు దక్షిణాఫ్రికా శుక్రవారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా నిర్ణయంతో ఐసీసీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది. ప్రపంచంలో దారుణమైన నేరాలను విచారించడానికి 2002లో ఈ కోర్టును ఏర్పాటు చేశారు. అయితే ఆఫ్రికా నేతలను లక్ష్యంగా చేస్తోందని ఆరోపణలు వచ్చాయి. అమెరికా సహా ఆఫ్రికా దేశాల నుంచి ఈ కోర్టుకు సహకారం లభించలేదు. ఈ కోర్టు నుంచి వైదొలిగిన తొలి దేశం దక్షిణాఫ్రికాయే.
2009లో యుద్ధనేరాల అభియోగాలపై సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్కు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా ఇప్పటి వరకు ఆయన్ను అరెస్ట్ చేయలేదు. గతేడాది దక్షిణాఫ్రికాలో జరిగిన ఆఫ్రికన్ యూనియన్ సదస్సులో ఆయన పాల్గొనడంతో వివాదం ఏర్పడింది. బషీర్ను అరెస్ట్ చేయకపోవడంపై దక్షిణాఫ్రికాపై విమర్శలు వచ్చాయి. కాగా ఆఫ్రికన్ యూనియన్ సభ్య దేశం అధినేతగా ఆయనకు పాల్గొనే హక్కు ఉందని దక్షిణాఫ్రికా వాదించింది. తమకు వ్యతిరేకంగా ఐసీసీ వ్యవహరిస్తోందని పలు ఆఫ్రికా దేశాలు ఆరోపిస్తున్నాయి. ఐసీసీ నుంచి వైదొలగనున్నట్టు ఈ నెల మొదట్లో బురుండి ప్రకటించింది. నమీబియా, కెన్యా కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశముంది.