వివాహిత తన ‘స్త్రీధనం’ ఎప్పుడైనా అడగొచ్చు
స్పష్టీకరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వివాహిత మహిళ తన ‘స్త్రీధనాన్ని’ వివాహం రద్దుకాకమునుపు ఎప్పుడైనా తన భర్త, లేదా అతని కుటుంబసభ్యులనుంచి వెనక్కు కోరవచ్చని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఆమె వివాహం చట్టబద్ధమైన డిక్రీద్వారా విడాకులు తీసుకోక ముందు ఆమె తన హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్‌ప్రఫుల్లసీ పంత్‌ల నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు తెలిపింది. అది స్థిర, చరాస్తులు కావచ్చనీ, అదే విధంగా వివాహానికి ముందు గానీ, లేదా అయిన తర్వాత సంక్రమించిందైనా ఆమె హక్కుకు భంగం వాటిల్లదని స్పష్టీకరించింది.
ఆమె భర్త కుటుంబీకులు ‘స్త్రీ ధనాన్ని ’ తమ వద్దే ఉంచుకోవడం నేరమా, కాదా అనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అదే సమయంలో దాన్ని పొందేందుకు బాధితులు సివిల్,లేదా క్రిమినల్ ఫిర్యాదులను ఆశ్రయించడాన్ని అడ్డుకోలేమన్నారు. మహిళలపై గృహహింసనుంచి రక్షిం చేందుకు ఉద్దేశించిన 2005 చట్టంలోని సెక్షన్ 12 ఆమెకు పూర్తి రక్షణ కల్పిస్తోందన్నారు. త్రిపుర హైకోర్టు, దాని కింది కోర్టులు ఓ కేసులో ఇచ్చిన ఉత్తర్వులను విచారిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ రూలింగ్ ఇచ్చింది.