Tripura High Court
-
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి జస్టిస్ అమర్నాథ్గౌడ్
సాక్షి, హైదరాబాద్: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించి యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం ఈ పురస్కారాన్ని న్యాయమూర్తికి అందజేశారు. 2017లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జస్టిస్ అమర్నాథ్గౌడ్ 92 వేల కేసులు పరిష్కరించారు. హైదరాబాద్‌కు చెందిన ఆయన్ను సుప్రీంకోర్టు కొలీజియం 2017లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించింది. అనంతరం త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు. -
నాలుగు హైకోర్టులకు సీజేలు
న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు హైకోర్టులకు నూతనంగా ప్రధాన న్యాయమూర్తు(సీజే)లు నియమితులయ్యారు. వీరిలో ఇద్దరు ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనుండటం గమనార్హం. గుజరాత్ హైకోర్టులో అత్యంత సీనియర్ జడ్జి అయిన జస్టిస్ సోనియా గిరిధర్ గోకానీని అదే హైకోర్టు సీజేగా నియమించారు. అదేవిధంగా, ఒరిస్సా హైకోర్టులో అత్యంత సీనియర్ జడ్జి జస్టిస్ జస్వంత్ సింగ్ త్రిపుర హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. ఈయన ఈ నెల 22న రిటైర్ కానున్నారు. ఇంతకుముందు జస్టిస్ సింగ్‌ను ఒరిస్సా హైకోర్టు సీజేగా నియమించాలంటూ చేసిన సిఫారసును కొలీజియం ఆతర్వాత ఉపసంహరించుకుంది. రాజస్తాన్ హైకోర్టుకు చెందిన జడ్జి జస్టిస్ సందీప్ మెహతాను గౌహతి హైకోర్టు సీజేగా నియమించారు. గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ జమ్మూకశ్మీర్ అండ్ లద్దాఖ్ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. తాజా నియామకాలను న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆదివారం ట్విట్టర్లో ప్రకటించారు. కాగా, జస్టిస్ గోకానీ బాధ్యతలు స్వీకరించాక దేశంలో ఉన్న 25 హైకోర్టుల్లో ఏకైక మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. గుజరాత్ జ్యుడిషియల్ సర్వీస్ నుంచి వచ్చిన ఈమెకు 62 ఏళ్లు నిండటంతో ఫిబ్రవరి 25న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ సబీనా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక సీజేగా ఉన్నారు. గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో జస్టిస్ గోకానీని తక్షణమే నియమించాలంటూ గత వారం కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇలా ఉండగా, రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమితులైన జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో సోమవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. -
నాలుగు హైకోర్టులకు సీజేలను సిఫార్స్ చేసిన కొలీజియం
న్యూఢిల్లీ: పట్నా, హిమాచల్ ప్రదేశ్, గువాహటి, త్రిపుర హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను ఎంపికచేస్తూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు పంపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ సభ్యులుగా ఉన్నారు. కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ను పట్నా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా, జస్టిస్ సబీనాను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు సీజేగా, త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ను, జస్టిస్ సందీప్ మెహతాను గువాహటి హైకోర్టు సీజేగా ఎంపికచేయాలంటూ కొలీజియం.. కేంద్రప్రభుత్వానికి తాజాగా సిఫార్సుచేసింది. -
త్రిపుర హైకోర్టు తాత్కాలిక సీజేగా తెలుగు వ్యక్తి
సాక్షి, న్యూఢిల్లీ: త్రిపుర హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా జస్టిస్ తొడుపునూరి అమర్నాథ్ గౌడ్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. నవంబరు 11 నుంచి ఆయన తాత్కాలిక సీజేగా కొనసాగుతారంటూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. జస్టిస్ అమర్నాథ్ 1965లో హైదరాబాద్‌లో జన్మించారు. 2017 సెప్టెంబర్ 21న ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2021 అక్టోబర్ 28న త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు. -
త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్ ఖురేషి
న్యూఢిల్లీ: త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ ఎ.ఎ. ఖురేషి పేరును సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా ప్రతిపాదించింది. గతంలో ఆయన్ను మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా ఎంపిక చేస్తూ కొలీజియం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వీటిపై ఈ నెల 5వ తేదీన జరిగిన కొలీజియం భేటీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఖురేషిని మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా ఎంపిక చేస్తూ మే 10వ తేదీన కొలీజియం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై కేంద్రం ఆగస్టులో పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదులు త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్ ఎ.ఎ. ఖురేషి పేరును తాజాగా కేంద్రం పరిశీలనకు పంపింది. అయితే, జస్టిస్ ఎ.ఎ. ఖురేషి ఆదేశాల మేరకే 2010లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పోలీసులు అరెస్టు చేశారని, తాజా పరిణామానికి అదే కారణమని గుజరాత్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రెసిడెంట్ యతిన్ ఓజా అనుమానం వ్యక్తం చేశారు. జస్టిస్ తహిల్ రమణి రాజీనామా ఆమోదం తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీకే తహిల్ రమణి రాజీనామా ఆమోదం పొందినట్లు కేంద్రం తెలిపింది. తనను మేఘాలయ కోర్టుకు బదిలీచేయడాన్ని ఆమె వ్యతిరేకిస్తూ తన రాజీనామా చేశారు. -
వివాహిత తన ‘స్త్రీధనం’ ఎప్పుడైనా అడగొచ్చు
స్పష్టీకరించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: వివాహిత మహిళ తన ‘స్త్రీధనాన్ని’ వివాహం రద్దుకాకమునుపు ఎప్పుడైనా తన భర్త, లేదా అతని కుటుంబసభ్యులనుంచి వెనక్కు కోరవచ్చని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఆమె వివాహం చట్టబద్ధమైన డిక్రీద్వారా విడాకులు తీసుకోక ముందు ఆమె తన హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ప్రఫుల్లసీ పంత్‌ల నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు తెలిపింది. అది స్థిర, చరాస్తులు కావచ్చనీ, అదే విధంగా వివాహానికి ముందు గానీ, లేదా అయిన తర్వాత సంక్రమించిందైనా ఆమె హక్కుకు భంగం వాటిల్లదని స్పష్టీకరించింది. ఆమె భర్త కుటుంబీకులు ‘స్త్రీ ధనాన్ని ’ తమ వద్దే ఉంచుకోవడం నేరమా, కాదా అనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అదే సమయంలో దాన్ని పొందేందుకు బాధితులు సివిల్,లేదా క్రిమినల్ ఫిర్యాదులను ఆశ్రయించడాన్ని అడ్డుకోలేమన్నారు. మహిళలపై గృహహింసనుంచి రక్షిం చేందుకు ఉద్దేశించిన 2005 చట్టంలోని సెక్షన్ 12 ఆమెకు పూర్తి రక్షణ కల్పిస్తోందన్నారు. త్రిపుర హైకోర్టు, దాని కింది కోర్టులు ఓ కేసులో ఇచ్చిన ఉత్తర్వులను విచారిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ రూలింగ్ ఇచ్చింది.