న్యూ ఇయర్‌ విషాదం: భార్యపై ప్రతీకారంతో.. | split with his wife: Brazilian killed 11in New Year’s party | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్‌ విషాదం: భార్యపై ప్రతీకారంతో..

Published Mon, Jan 2 2017 9:13 AM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

రమిస్‌ భార్య ఇంటివద్ద ఆమె బంధువులు. - Sakshi

రమిస్‌ భార్య ఇంటివద్ద ఆమె బంధువులు.

సావొపోలో: గొడవపడి తన నుంచి విడిపోయిన భార్యపై ప్రతీకారం పెంచుకున్న ఓ వ్యక్తి ఉన్మాదిగామారి రక్తపాతం సృష్టించాడు. నూతన సంవత్సర వేడుకలో పాల్గొన్న భార్య, ఎనిమిదేళ్ల కొడుకు సహా 11 మందిని కిరాతకంగా కాల్చిచంపాడు. ఆగ్రేయ బ్రెజిల్‌లోని కాంపినస్‌ పట్టణంలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సావొపోలో పోలీసుల కథనం ప్రకారం.. (న్యూ ఇయర్‌ పార్టీలో దుండగుడి కాల్పులు: 39 మంది మృతి.. 70 మందికి గాయాలు)

ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తోన్న సిడ్నే రమిస్‌ డి అరజో(46)ను కొద్ది రోజుల కిందటే భార్య వదిలేసింది. ఎనిమిదేళ్ల కొడుకు(విక్టర్‌)ను తనతోనే తీసుకెళ్లి వేరొక ఇంట్లో ఉంటున్న ఆమెపై రమిస్‌ కక్ష పెంచుకున్నాడు. భార్యను అంతం చేయాలని ముందుగానే పథకం వేసుకుని ఆ మేరకు తుపాకి, అదనపు బుల్లెట్లు, కత్తి, పేలుడు పదార్థాలతో కారులో ఆమె ఇంటికి వెళ్లాడు. దగ్గరి బంధువులతో ఇంట్లోనే న్యూఇయర్‌ వేడుక జరుగుతుండగా, ఫెన్సింగ్‌దూకి ఇంట్లోకి దూసుకెళ్లిన రమిస్‌.. వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. భార్య, కొడుకు సహ 11 మంది అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉన్మాద చర్య అనంతరం రమిస్‌ తననుతాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

రమిస్‌ కాల్పుల బారి నుంచి తప్పించుకుని బాత్‌రూమ్‌లో దాక్కొన్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. 'పక్కింట్లో నుంచి కాల్పుల శబ్ధం వినిపించింది. అయితే న్యూఇయర్‌ సందర్భంగా పటాకులు కాలుస్తున్నారేమో అనుకున్నామేగానీ ఇంత దారుణం జరుగుతోందని ఊహించలేకపోయాం. బుల్లెట్‌గాయాలతో ఒకరిద్దరు మా ఇంటివైపు పరుగెత్తడం చూశాకగానీ అసలు విషయం అర్థంకాలేదు'అని చుట్టుపక్కలవారు తెలిపారు.

కాల్పులు జరిగిన ఇంటి ముందు పార్క్‌ చేసి ఉంచిన రమిస్‌ కారు నుంచి పేలుడు పదార్థాలు, ఆడియో రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే నిందితుడు ఏదైనా సందేశం రికార్డు చేశాడా, లేదా అనేది పరిశీలించాల్సి ఉందన్నారు. డ్రగ్స్‌, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ మాఫియా జూలు విదిల్చే బ్రెజిల్‌లో హింసాత్మక ఘటనలు ఎక్కువే అయినప్పటికీ, వేడుకల్లో సామూహిక హత్యలు చోటుచేసుకోవడం అరుదని పోలీసులు చెప్పారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేపట్టామన్నారు.
హత్యాకాండ జరిగిన ఇంటివద్ద విషాద దృశ్యాలు






Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement