భార్యకు ప్రేమతో.. | sridhar reddy made jungle type resort in hyderabad | Sakshi
Sakshi News home page

భార్యకు ప్రేమతో..

Published Sun, Jun 26 2016 8:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

sridhar reddy made jungle type resort in hyderabad

సాక్షి వెబ్  ప్రత్యేకం

విహార యాత్ర కోసం కొడుకుతో కలిసి కేరళకు వెళ్లిందో జంట. పచ్చని ప్రకృతి నడుమ.. సంప్రదాయ పద్ధతిలో చెక్కలతో నిర్మించిన కుటీరంలో విడిది చేశారు. అక్కడి ఆహ్లాదకమైన వాతావరణానికి ముగ్దురాలైంది ఆ భార్య. 'మనం ఉంటున్న ఊళ్లో మనకు కూడా ఇలాంటి ఇల్లుంటే ఎంత బాగుంటుంది కదా' అని భర్తతో అంది. ఆమె సరదాగా కోరుకున్నా.. దాన్ని నిజం చేయాలని అక్కడే అనుకున్నాడా భర్త.

యాత్ర ముగించుకుని  హైదరాబాద్ వచ్చారు. ఆలస్యం చెయ్యకుండా తలపెట్టిన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఏడాది తిరిగేలోపే.. నాడు కేరళలో గడిపినలాంటిదే ఫ్లైవుడ్ కుటీరాన్ని నిర్మించి, దాని చుట్టూ లెక్కకుమిక్కిలి మొక్కలు నాటి.. ఒక్కమాటలో చెప్పాలంటే దాన్నొక ప్రేమక్షేత్రంగా మలిచి భార్యకు బహుమతిగా ఇచ్చాడు.

భర్తలందు భార్యలను ప్రేమించువారు వేరయా.. అన్నట్లు భార్యను అమితంగా గౌరవించే ఆ భర్త పేరు చెగిరెడ్డి శ్రీధర్‌రెడ్డి. అదే రీతిలో అతన్ని ప్రేమించే భార్య పేరు లక్ష్మి. ఎల్బీనగర్‌లోని బీఎన్‌రెడ్డి నగర్‌ లో నివాసం. శ్రీధర్‌ రెడ్డి ప్రైవేట్‌ కంపెనీలో రీజినల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. లక్ష్మి గృహిణి. వాళ్లు నిర్మించుకున్న ఇంటిచుట్టూ రకరకాల కాయగూరలు, పండ్లు, పూల మొక్కలు అందంగా అమరాయి. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో దొండ, సొర వంటి తీగజాతి మొక్కలు వంగ, మిర్చి, క్యాబేజీ వంటి కాయగూర పంటలు, దానిమ్మ, తమలపాకు, వామాకు, చిన్న ఉసిరి, అడవి ఉసిరి, ద్రాక్ష,  బొప్పాయి, పైనాపిల్, డ్రాగన్‌ ఫ్రూట్, పాషన్‌ ఫ్రూట్, ఎర్రజామ, అరటి, అంజూర, గంగరేగి, మామిడి వంటి పండ్ల మొక్కలు...బ్రహ్మకమలం, అడవి సంపెంగ వంటి పూల మొక్కలను పెంచుతున్నారు. అన్నట్లు ఓ ఆపిల్‌ చెట్టు కూడా వీళ్ల పెరట్లో ఉంది.
ముగ్గురు సభ్యుల చింతలేని కుటుంబానికి ఇంట్లో పండించే కూరగాయలు సరిపోతాయని, మొక్కల పెంపకానికి అవసరమైన కంపోస్టు ఎరువు, జీవామృతాన్ని స్వయంగా తయారుచేసుకుంటామని శ్రీధర్‌ రెడ్డి, లక్ష్మిలు చెబుతున్నారు. చుట్టూరా కాంక్రీట్ నిర్మాణాల నడుమ ఈ దంపతులు అభిరుచితో నిర్మించుకున్న కుటీరం ప్రత్యేకంగా నిలుస్తోంది. కేవలం వీళ్ల ఇల్లు చూడటానికే తెలిసినవాళ్లు, బంధువులు తరచూ వస్తూపోతూఉంటారట. ‘ఇంటికి వచ్చే బంధువులు మా అభిరుచిని మెచ్చుకుంటారు. హైదారబాద్‌లో ఉన్నన్ని రోజులు అపార్ట్‌మెంట్లలో కన్నా ఈ ఇంటిపంటల కుటీరం మధ్య ఉండటానికే నేనూ, నా భార్య, కొడుకు ఇష్టపడతాం' అని సంతోషంగా చెబుతారు శ్రీధర్‌రెడ్డి దంపతులు.

- ఎస్. శ్రీమన్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement