యూత్ కాంగ్రెస్‌లో హోరాహోరీ! | State President The position of the ring In the Descendants of leaders | Sakshi
Sakshi News home page

యూత్ కాంగ్రెస్‌లో హోరాహోరీ!

Published Mon, Sep 7 2015 1:21 AM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM

యూత్ కాంగ్రెస్‌లో హోరాహోరీ! - Sakshi

యూత్ కాంగ్రెస్‌లో హోరాహోరీ!

రాష్ట్ర అధ్యక్ష పదవి బరిలో నేతల వారసులు
* గెలుపు కోసం మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే తనయుల ఢీ
* ఇరువర్గాలు పరస్పరం బెదిరింపులు, కిడ్నాప్‌లకు దిగుతున్న వైనం  
* వారసులతో పోటీ పడలేమంటున్న సాధారణ యువనేతలు
* ఈ నెల 9, 10 తేదీల్లో ఎన్నికలు, 12న ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : యువజన కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌లో హల్‌చల్ సృష్టిస్తోంది. నేతల వారసులు రంగంలోకి దిగడంతో వాతావరణం వేడెక్కింది.

ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తనయుడు అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎంఎల్‌ఏ భిక్షపతి యాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్‌లు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఇప్పటికే గ్రామ, అసెంబ్లీ నియోజకవర్గస్థాయి ఎన్నికలు ముగిసిపోగా, 9, 10 తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గ కమిటీలతో పాటు రాష్ట్ర కార్యవర్గాన్ని సుమారు తొమ్మిదివేల మంది ప్రతినిధులు రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకోనున్నారు.

తమ కుమారుల విజయం కోసం మాజీ ఎంపీ అంజన్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌లు కాంగ్రెస్‌లోని ముఖ్య నేతల సాయం కోరుతుండటంతో  పార్టీలోని ముఖ్య నాయకులంతా రెండు వర్గాలుగా చీలిపోయి వేర్వేరుగా రెండు ప్యానెల్‌లకు మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది.
 
బెదిరింపులు, అడ్డదారులు ... : ఈ ఎన్నికలను రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహిస్తున్నప్పటికీ ఇరు ప్యానెళ్లు పరస్పరం కిడ్నాప్‌లు, భౌతిక దాడులు, బెదిరింపులకు దిగాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన న రేశ్‌ను బెదిరించి కిడ్నాప్‌నకు యత్నించారన్న అభియోగంతో మాజీ ఎంపీ అంజన్ తనయుడిపై గంగాధర పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా, ఇదే తరహాలో మహబూబ్‌నగర్, సనత్‌నగర్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయి. రవికుమార్‌సైతం తమను బెదిరించారని ఓ యువజన కాంగ్రెస్ నేత సైబరాబాద్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దీనిపై అనిల్‌కుమార్ మాట్లాడుతూ  ప్రత్యర్థి వర్గం తప్పుడు ఫిర్యాదులు చేస్తోందన్నారు.

ఇదే విషయంపై రవికుమార్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మార్గదర్శకాలకు విరుద్ధంగా బెదిరింపులు, కిడ్నాప్‌లతో ఎన్నికలను గెలవాలని చూడటం దారుణమన్నారు. కాగా, దాడులు, బెదిరింపుల వ్యవహారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేసుకునే స్థాయికి వెళ్లిందని కొందరు పార్టీ నేతలు వెల్లడించారు. 9, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలయ్యే ఓట్లను 12వ తేదీన హైదరాబాద్‌లో లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.
 
జిల్లాల్లోనూ నేతల వారసులు..

ఇక జిల్లాల్లో కూడా పలువురు నేతల వారసులు రంగంలో ఉన్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం స్థానం నుంచి మేఘనారెడ్డి (మాజీ మంత్రి జె.గీతారెడ్డి కుమార్తె), మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి సంతోష్‌రెడ్డి(మాజీమంత్రి వి.సునీతా లక్ష్మారెడ్డి దగ్గరి బంధువు) పోటీ పడుతున్నారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష పదవికోసం మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తనయుడు చరణ్‌రెడ్డి రంగంలో ఉన్నారు.

నాగర్‌కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవికోసం మాజీమం త్రి డి.కె.అరుణ కూతురు స్నిగ్ధారెడ్డి పోటీ పడుతున్నారు. కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్ కుమారుడు సాయినాథ్ మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకర్గ అధ్యక్ష పదవికోసం రేసులో ఉన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌నేత రత్నాకర్‌రెడ్డి తనయుడు రమాకాంత్‌రెడ్డి వరంగల్ నియోజకవర్గానికి పోటీ పడుతున్నారు.
 
కాంగ్రెస్‌లో మా పరిస్థితేంటి?

పార్టీకోసం అంకితభావం కలిగిన నాయకత్వాన్ని యువజన స్థాయి నుంచి అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో జరుగుతున్న ఎన్నికలను సీనియర్ నేతల వారసులు తమ అధిపత్యం కోసం వాడుకుంటున్నారని సాధారణ యువజన నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎలాంటి వారసత్వం, ఆర్థిక బలం లేని తాము వెనకబడిపోవాల్సి వస్తోందని, పార్టీలో ఎప్పటికీ దిగువస్థాయిలోనే ఉండిపోవాల్సి వస్తోందని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement