రాష్ట్రం విడిపోదు : అశోక్‌బాబు
* రాహుల్, కేసీఆర్ తుగ్లక్‌లు: అశోక్‌బాబు
* ఉద్వేగంతో కంటతడి పెట్టిన లగడపాటి
* సోనియాకూ ఇందిరా, రాజీవ్ గతే: మోదుగుల
* ముందు కేంద్రం క్షమాపణ చెప్పాలి: ఉండవల్లి
* నేడు చివరి రోజు.. జాతీయ నేతల హాజరు
న్యూఢిల్లీ నుండి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విభజన జరగదని, ఆపడానికి దేవుడు ఏదొక రూపంలో వస్తాడని సమైక్యాంధ్ర నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఏపీ ఎన్జీవో తలపెట్టిన రెండు రోజుల ధర్నా సోమవారం ప్రారంభమైంది. ఈ ధర్నాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ జేఏసీల ప్రతినిధులు పాల్గొన్నారు. పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం కుట్ర చేస్తోందని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ అశోక్‌బాబు ధ్వజమెత్తారు. ప్రజాస్వామికంగానే విభజనను అడ్డుకుని తీరతామన్నారు. మంగళవారం జాతీయ నేతలు ధర్నాలో పాల్గొంటారన్నారు. ‘రాహుల్, కేసీఆర్ తుగ్లక్‌లు. అందుకే తుగ్లక్ రోడ్డులోనే ఉంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.
పౌరుషం చూపితే పారిపోయారు: లగడపాటి
‘‘విభజన సమయానికి కచ్చితంగా పార్లమెంటులో అడుగుపెట్టి తీరుతా. నన్ను ఏ శక్తీ ఆపలేదు. తెలుగువాడి సత్తా ఏమిటో ఈ నెల 13న పార్లమెంటులో చూశారు. పౌరుషం చూపిస్తే అన్ని ప్రాంతాల ఎంపీలూ పార్లమెంటును విడిచిపెట్టి పారిపోయారు. విభజనను ఆపి తీరతాం. దానికి మన వ్యూహాలు మనకున్నాయి’’ అని ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టారు. అడ్డగోలు విభజనకు పూనుకుంటున్న కేంద్రమే ముందుగా క్షమాపణ చెప్పాలని ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ‘‘అబల లాంటి ఆంధ్రాను కేంద్రం రేప్ చేయజూసినందుకే పెప్పర్ స్ప్రేను ఉపయోగించారు. అదేమీ తప్పు కాదు. ఆత్మరక్షణ చేసుకోవాలని ప్రభుత్వమే చెప్పింది. స్ప్రే వాడే పరిస్థితులు తెచ్చినందుకు కేంద్ర పాలకులు సిగ్గుపడాలి’’ అన్నారు.
విభజనకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులంతా ఉద్యమించాలని మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. కొత్త జంటను విడదీస్తే ఎంత పాపమో, విభజన కూడా అంతే పాపమని మరో మంత్రి కాసు కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. విభజించడానికి వీళ్లెవరని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. విభజనను అడ్డుకోవడానికి దేవుడే వస్తాడని టీడీపీ ఎంపీలు శివప్రసాద్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. సిక్కుల మధ్య చిచ్చు పెట్టినందుకు ఇందిరాగాంధీకి, తమిళుల మధ్య చిచ్చు పెట్టినందుకు రాజీవ్‌గాంధీకి పట్టిన గతే ఇప్పుడు తెలుగువారి మధ్య చిచ్చు పెడుతున్న సోనియాకు కూడా పడుతుందని మోదుగుల హెచ్చరించారు. అన్నదమ్ములను విడదీసేది ఇలాగేనా అని టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ప్రశ్నించారు. ఎంపీ సబ్బంహరి, టీడీపీ నేతలు దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నేత చంద్రశేఖర్‌రెడ్డి, చలసాని శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.
తుదిశ్వాస వరకు ‘సమైక్య’ పోరులో...
సాక్షి, న్యూఢిల్లీ/నెల్లూరు: నెల్లూరు జిల్లాకు చెందిన ఏపీ ఎన్జీవో నేత చిరమన దామోదర జోషి గుండెపోటుతో మృతి చెందారు. రామ్‌లీలా మైదానంలో ఉదయం ధర్నా మొదలవుతున్న సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశారు. దీనిపై వక్తలంతా సంతాపం తెలిపారు. జోషి కుటుంబసభ్యులకు ఎంపీలు సుజనా చౌదరి రూ. 3 లక్షలు, కేవీపీ రామచంద్రరావు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. జోషి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మునుబోలు ఎంపీడీవో కార్యాలయం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జోషి నెల్లూరు జ్యోతినగర్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సకల జనుల సమ్మె విజయవంతమవడంలో కీలకపాత్ర పోషించారు. విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు సంబంధించి నెల్లూరు జిల్లా నుంచి ఏర్పాట్లన్నీ జోషియే దగ్గరుండి చూసుకున్నారు. రైల్లో ఢిల్లీ వెళ్లిన ఆయన చివరకు సమైక్య పోరులోనే అసువులుబాశారు. జోషి భార్య నెల్లూరులోని మున్సిపల్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు.