సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో విద్వేషాలు పెరిగిపోయాయని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన మెగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశాన్ని విభజిస్తున్నాయని విరుచుకుపడ్డారు. తమ భవిష్యత్తు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత వంటి అంశాలపై ప్రజలు భయపడుతున్నారని, దేశంలో అభద్రతా భావం పెరిగిపోయిందని పేర్కొన్నారు.
ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో హస్తం పార్టీ చెపట్టిన ‘మెహంగై పర్ హల్లా బోల్ ర్యాలీ’కి భారీగా జనం తరలివచ్చారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు హాజరై మాట్లాడారు. ‘ ప్రభుత్వం నుంచి ఇద్దరే వ్యాపారవేత్తలు లబ్ధిపొందుతున్నారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రోడ్లు.. ప్రతిఒక్కటి ఆ ఇద్దరే చేజిక్కించుకుంటున్నారు. నరేంద్ర మోదీ దేశాన్ని వెనకబడేలా చేస్తున్నారు. విద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారు. దాని ద్వారా పాకిస్థాన్, చైనాలు లబ్ధి పొందుతున్నాయి. పీఎం మోదీ గత 8 ఏళ్లుగా దేశాన్ని బలహీనపరిచారు.’ అని బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ.
ఈ మెగా ర్యాలీకి కార్యకర్తలను సిద్ధం చేసేందుకు వారం రోజులుగా తీవ్రంగా శ్రమించారు కాంగ్రెస్ నేతలు. 22 నగరాల్లో ప్రత్యేక సమావేశాలను నిర‍్వహించి ఢిల్లీ చలో నినాదంతో పిలుపునిచ్చారు. రామ్‌లీలా మైదానంలో ర్యాలీకి ముందు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్వేషాలు ప్రధాన సమస్యలుగా మారాయన్నారు.
ఇదీ చదవండి: 150 రోజులు.. 3,570 కిలోమీటర్లు.. రాహుల్ భారత్ జోడో యాత్ర.. కాంగ్రెస్‌కు మంచి రోజులొస్తాయా?
Comments
Please login to add a commentAdd a comment