అమెరికాలో రీకౌంటింగ్‌కు ఓకే! | statewide recount in Wisconsin after US presidential election | Sakshi
Sakshi News home page

అమెరికాలో రీకౌంటింగ్‌కు ఓకే!

Published Sat, Nov 26 2016 10:31 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

అమెరికాలో రీకౌంటింగ్‌కు ఓకే! - Sakshi

అమెరికాలో రీకౌంటింగ్‌కు ఓకే!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం. డొనాల్డ్‌ ట్రంప్‌ స్వల్పతేడాతో గట్టెక్కిన మూడు రాష్ట్రాల్లోనూ రీకౌంటింగ్‌ జరుపాలన్న డిమాండ్‌ వెల్లువెత్తడంతో విస్కాన్సిన్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్త రీకౌంటింగ్‌కు అంగీకరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా విస్కాన్సిన్‌లో నమోదైన ఓట్లను మళ్లీ లెక్కించాలని గ్రీన్‌ పార్టీ అభ్యర్థి జిల్‌ స్టీన్‌ విజ్ఞప్తి చేయగా.. ఇందుకు ఎన్నికల సంఘం ఓకే చెప్పింది.

విస్కాన్సిన్‌ రాష్ట్రంలో రీకౌంటింగ్‌లో భాగంగా 30లక్షల బ్యాలెట్‌ ఓట్లను కూడా మళ్లీ లెక్కించనున్నారు. వచ్చేవారం ఈ రీకౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఇందుకు అయ్యే ఖర్చును గ్రీన్‌ పార్టీ కాంపెయినే భరిస్తుంది. ఫెడరల్‌ డెడ్‌లైన్‌ ప్రకారం డిసెంబర్‌ 13లోపు రీకౌంటింగ్‌ పూర్తిచేయాలి.  ఈ గడువులోగా విస్కాన్సిన్‌లోని 72 కౌంటీల్లో రీకౌంటింగ్‌ పూర్తిచేయడానికి అధికారులు సాయంత్రాలు, వారాంతలు కూడా పనిచేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. రీకౌంటింగ్‌ ఫీజు 1.1 మిలియన్‌ డాలర్ల (రూ. 7.5 కోట్ల)వరకు అయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
(చదవండి: అమెరికా ఎన్నికల్లో హ్యాకింగ్? రీ కౌంటింగ్ కు పట్టు!)


అనేక వ్యయప్రయాసలకు ఓర్చి గ్రీన్‌ పార్టీ అభ్యర్థి చేపడుతున్న ఈ రీకౌంటింగ్‌ ప్రక్రియ వల్ల ఓడిపోయిన హిల్లరీ వర్గీయుల్లో కొంత ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే, ప్రస్తుతం చేపడుతున్న రీకౌటింగ్‌ వల్ల ఈ నెల 8న జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తారుమారు అయి.. ట్రంప్‌ స్థానంలో హిల్లరీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపడుతుందా? అంటే ఆ అవకాశాలు చాలా స్వల్పమని, రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేసిన మూడు రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టినా.. ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం చాలా తక్కువ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఓటింగ్‌లో పెద్ద ఎత్తున హ్యాకింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ గ్రీన్‌ పార్టీ అభ్యర్థి జిల్‌ స్టీన్‌ రీకౌంటింగ్‌ ప్రక్రియను తెరపైకి తెచ్చారు. ఆమె రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేసిన మూడు రాష్ట్రాలు విస్కాన్సిన్‌, మిచిగన్‌, పెన్సిల్వేనియాలలో హిల్లరీపై స్వల్ప ఆధిక్యంతో ట్రంప్‌ విజయం సాధించారు. పెన్సిల్వేనియాలో 70,010 ఓట్ల తేడాతో, మిచిగన్‌లో 10,704 ఓట్లతో, విస్కాన్సిన్‌లో 27,257 ఓట్లతో ట్రంప్‌ విజయం సాధించారు. అయితే, ఈ మూడు రాష్ట్రాల రీకౌంటింగ్‌లో ట్రంప్‌ కన్నా హిల్లరీ ఆధిక్యం సాధించే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ మూడు రాష్ట్రాల్లో హిల్లరీ ట్రంప్‌పై విజయం సాధిస్తే.. మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే అవకాశముంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement