
రద్దయిన నోట్లు మిగిలిపోయాయా? అయితే..
ముంబై: రద్దయిన పాత నోట్లు ఇంకా మిగిలిపోయాయా? రూ. 500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేయడం మర్చిపోయారా..అయితే అలాంటి వారికి నిజంగా లడ్డూ లాంటి వార్తే. రద్దయిన ఈ పెద్దనోట్లను మార్చుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుందట. రూ. 500, రూ.1000 నోట్ల మార్పిడికి, బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు మరో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుందని జాతీయ మీడియా గురువారం రిపోర్ట్ చేసింది.
పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ, బ్యాంకు అధికారుల వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఈ విషయాన్ని రిపోర్టు చేసింది. తమ దగ్గర మిగిలిపోయిన పెద్దనోట్ల డిపాజిట్ కు అనుమతించాల్సిందిగా కొంతమంది కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకుకు లేఖ రాసినట్టు పేర్కొంది. అయితే ఈ అవకాశాన్ని చాలా తక్కువ విలువ డిపాజిట్లకు పరిమితం చేయవచ్చని తెలిపింది. ఈ పరిమితి సుమారు రూ.2వేలుగా ఉండొచ్చని తెలుస్తోంది.
కాగా నవంబరు 8న దేశవ్యాప్తంగా రూ.500,1000 పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటన సంచలనం రేపింది. ఈ నోట్లను బ్యాంకుల్లో మార్పడి చేసేందుకు కొన్ని పరిమితులను, ఆంక్షలను విధించింది. మరోవైపు పాత నోట్ల డిపాజిట్లకు గడువు 2016 డిసెంబర్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే.